Begin typing your search above and press return to search.

లోకేష్ కి పట్టాభిషేకం...ఇపుడు ఎందుకీ ప్రచారం ?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత సర్వసత్తాక నాయకుడు ఎవరు అంటే రెండో మాట లేకుండా చెప్పే పేరు నారా లోకేష్ అని. అవును ఆయన పార్టీకి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్.

By:  Satya P   |   16 Aug 2026 9:44 AM IST
లోకేష్ కి పట్టాభిషేకం...ఇపుడు ఎందుకీ ప్రచారం  ?
X

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తరువాత సర్వసత్తాక నాయకుడు ఎవరు అంటే రెండో మాట లేకుండా చెప్పే పేరు నారా లోకేష్ అని. అవును ఆయన పార్టీకి జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్. పార్టీలో కీలకమైన నిర్ణయాలలో లోకేష్ పాత్ర ఉంటోందని కూడా ప్రచారం సాగుతోంది. ఇక ప్రభుత్వంలో లోకేష్ పాత్ర ఎంత ఏమిటి అంటే టీడీపీకి 20 మంది మంత్రులు ఉన్నారు. అందులో లోకేష్ కాక పందొమ్మిది మంత్రులతోనూ లోకేష్ మీటింగ్స్ సొంతంగా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ విదేశీ పర్యటనలు పూర్తి చేసుకుని వస్తే ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ మంత్రులు ఆయనతో సమావేశాలు జరిపిన నేపథ్యం కూడా ఉంది. పార్టీలో ప్రభుత్వంలో అలా లోకేష్ పాత్ర అయితే స్పష్టం. అయితే లోకేష్ ని టీడీపీ వరకూ కాబోయే సీఎం గానే అంతా చూస్తున్నారు. అది కూడా ఇపుడు కాదని 2029 ఎన్నికల తరువాతని రాజకీయ విశ్లేషకుల మాట కూడా ఉంది. కానీ ఇపుడు సడెన్ గా ఒక రూమర్ అనుకోండి, గాసిప్స్ అనుకోండి అలాంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అదేంటి అంటే లోకేష్ కి తొందరలోనే పట్టాభిషేకం జరుగుతుందని.

స్థానిక ఎన్నికల తరువాత :

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రస్తుతానికి రెండేళ్ళు పై దాటింది. ఈ డిసెంబర్ నాటికి రెండున్నరేళ్ళు అవుతుంది అంటే సగం పాలన పూర్తి అయినట్లు అన్న మాట. ఆ సమయానికి లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేసే ప్రతిపాదన అయితే టీడీపీలో సీరియస్ గానే సాగుతోంది అని అంటున్నారు. దీని కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ లో నిర్వహించి ఒక కీలక ఘట్టాన్ని ముగిస్తారు అని అంటున్నారు. ఆ తరువాత లోకేష్ కి పట్టాభిషేకం జరుగుతుందని, దాని కోసం శుభ ముహూర్తాన్ని సిద్ధం చేసి ఉంచారని కూడా అంటున్నారు.

అవునా నిజమా అంటే :

ఇది ఏపీ రాజకీయాల్లో చూస్తే అతి పెద్ద సంచలన వార్తగానే భావించాలి. జాతీయ స్థాయిలో చూస్తే ఒక సాధారణ వార్త మాత్రమే. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల తండ్రుల తరువాత తనయులు రాజకీయంగా చురుకుగా ఉంటూ అధికార పదవులు చేపట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి. ఇక ఏపీలో చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమికి 2024లో 164 సీట్లు వచ్చాయి. అందులో జనసేన 21, బీజేపీ ఎనిమిది తీసేస్తే టీడీపీకే సొంతంగా 135 సీట్లు ఉన్నాయి. మొత్తం 175 మంది ఉన్న అసెంబ్లీలో ఇది బాహుబలి మార్క్ మెజారిటీ అని వేరీగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇంతటి మెజారిటీ ఉన్నపుడు టీడీపీ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏమైనా చేయవచ్చు. అయితే కూటమి పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకుని మసలుకోవడం కోసమే ఇన్నాళ్ళ జాప్యం అని అంటున్నారు.

జరిగే వీలుందా :

అంటే రాజకీయాల్లో ఎపుడైనా ఏమైనా జరగవచ్చు అని అంటున్నారు. ఇక చూస్తే తెలుగుదేశం పార్టీ ఈ దిశగా ఆలోచన చేస్తోంది అని కాపునాడు నాయకుడు దాసరి రాము చెబుతున్నారు. ఆయన ఒక చానల్ లో మాట్లాడుతూ తనకు ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఉందని అన్నారు. తెలంగాణాలో కేటీఆర్ ని సీఎం గా సరైన సమయంలో కేసీఆర్ చేయలేకపోయారు అని అలాగేయూపీయే ప్రభుత్వం రెండు టెర్ములు అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా తప్పు చేశారని అలాంటి పొరపాట్లు రానీయకుండా టీడీపీ ముందుగానే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోందని ఆయన అంటున్నారు. దాసరి రాము చెప్పారని కాదు కానీ ఈ ప్రచారం అయితే గట్టిగానే ఉంది. ఇక కేంద్రంలో మోడీ కూడా లోకేష్ పనితీరు పట్ల సంతృప్తిగానే ఉన్నారు. ఇటీవల భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ తరువాత ఆయన లోకేష్ భుజం తట్టిన తీరుని అంతా చూశారు. అంతకు ముందు కూడా ఆయన యువనేత లోకేష్ సామర్థ్యాన్ని మెచ్చుకున్నారని చెబుతారు. ఈ నేపథ్యంలో లోకేష్ పగ్గాలు అందుకోవడానికి అయితే సరిగ్గా ఇదే సరైన ముహూర్తం అన్న మాట కూడా ఉంది. మరి ఈ పుకార్లు లేదా కొందరు చెబుతున్న మాటలు ఏ మేరకు నిజం అవుతాయి అన్నది చూడాల్సి ఉంది.