Begin typing your search above and press return to search.

11 గంటల ముహూర్తం ఎందుకంటే?.. లోకేశ్ సెటైర్లు

అమరావతిపై తీర్మానంపై వైసీపీ అభిప్రాయం చెప్పాల్సివుంది. అసెంబ్లీకి రాకుండా రాని ఎమ్మెల్యేలకు రాజధానిపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు.

By:  Tupaki Political Desk   |   28 March 2026 3:06 PM IST
11 గంటల ముహూర్తం ఎందుకంటే?.. లోకేశ్ సెటైర్లు
X

అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం సందర్భంగా మంత్రి లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షం వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని టార్గెట్ చేస్తూ లోకేశ్ వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. సభ ప్రారంభానికి ముందు మంత్రి లోకేశ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రతిసారి క్రెడిట్ చోరీ అంటూ వ్యాఖ్యలు చేస్తున్న మాజీ సీఎం జగన్ టార్గెట్ గా లోకేశ్ పంచు డైలాగులు పేల్చారు. అసెంబ్లీపై తీర్మానానికి సభను 11 గంటలకు సమావేశ పరచాడాన్ని ప్రస్తావిస్తూ.. వైసీపీకి ఉన్న 11 సంఖ్యను దృష్టిలో పెట్టుకుని సరిగ్గా ఉదయం 11 గంటలకు ముహూర్తం పెట్టామని చమత్కరించారు.

అమరావతి చట్టబద్ధతపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమెదించిన వెంటనే రాజధాని బిల్లును కేంద్రానికి పంపుతామని వెల్లడించారు. ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ సమావేశంలో అమరావతి బిల్లుపై చర్చించి ఆమోదిస్తారని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2న పార్లమెంటులో అమరావతి బిల్లును కేంద్రం ప్రవేశపెడుతుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. కీలక బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి గైర్హాజరుకావడాన్ని లోకేశ్ తప్పుపట్టారు. విపక్ష సభ్యులు ప్రజల గొంతును వినిపించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు.

అమరావతిపై తీర్మానంపై వైసీపీ అభిప్రాయం చెప్పాల్సివుంది. అసెంబ్లీకి రాకుండా రాని ఎమ్మెల్యేలకు రాజధానిపై ఎలాంటి చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అంటూ లోకేశ్ విమర్శలు గుప్పించారు. ఇక అమరావతి బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో చూడాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇక ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై మంత్రి లోకేశ్ సెటైర్లు పేల్చారు. బ్లూ బుక్ ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రొటోకాల్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో తాము పాదయాత్ర చేసినప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను మర్చిపోలేదు. సినిమా చూపిస్తా అన్న జగన్ సినిమా ఎలా ఆడిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

ఇక రాజధానిని మార్చాలనే ఆలోచన ప్రపంచంలో జగన్‌కు తప్ప ఇంకెవరికీ రాదని మంత్రి లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్‌కి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని, రేపు అమరావతిని నేనే కట్టానని జగన్ చెప్పినా ఆశ్చర్యం లేదన్నారు. ‘‘2024 ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమో.. మళ్ళీ పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తానంటున్నారని.. ప్రజలు చూపించిన బ్లాక్ బాస్టర్ సరిపోలేదేమో’’ అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ చూపిస్తానంటున్న సినిమా 11రోజులకు మించి ఆడదన్నారు. అమరావతి తీర్మానాన్ని రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలు ఆనందిస్తున్నారని లోకేష్ అన్నారు.

రాష్ట్రంలో మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. పార్లమెంట్లోనైనా వైసీపీ తన వైఖరి చెప్తుందా లేక బెంగళూరు పోతుందా? అన్నారు. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోలేదన్నారు. ఏ రోజు ఏ ఆత్మ జగన్‍తో ఏం మాట్లాడిస్తుందో అనే ఆందోళనలో వైసీపీ నేతలున్నారన్నారు. వైసీపీలో సజ్జల జ్ఞానం ఏపాటిదో అందరికీ తెలుసన్నారు. అమరావతి తీర్మానానికి వైసీపీ గైర్హాజరు వారి చిత్తశుద్ది ఏంటో స్పష్టం చేస్తోందన్నారు.