మహిళామణుల కోసం లోకేశ్ 'బిగ్ అనౌన్స్ మెంట్'
‘రాజకీయాల్లో మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదు, వారు నిర్ణేతలుగా మారాలి అన్న భావనతో పార్టీలో వచ్చే ఎన్నికల నాటికి 33 శాతం రిజర్వేషన్ల విధానాన్ని తీసుకువస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు.
By: Tupaki Political Desk | 27 May 2026 3:22 PM ISTతెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న మహానాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ‘ఈ రోజు ఒక బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను’ అంటూ లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన ముందస్తు అప్‌డేట్ సస్పెన్స్ క్రియేట్ చేసింది. అసలు లోకేశ్ ఏం చెప్పబోతున్నారు? పార్టీ పరంగా ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? అనే ఉత్కంఠతో మంత్రి చేయబోయే బిగ్ అనౌన్సెమెంట్ కోసం అంతా ఆత్రుతగా ఎదురుచూశారు. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం అమలుపై ఏమైనా అప్డేట్ చేస్తారా? అంటూ చాలా మంది అంచనాలు వేసుకున్నారు. కానీ, మంత్రి లోకేశ్ అంతకుమించి అన్నట్లు మహిళల కోసం భారీ హామీ ఇచ్చారు.
లోకేశ్ సంచలన ప్రకటన
తెలుగుదేశం పార్టీలో మహిళలకు ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యమిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీ బాధ్యతలు తీసుకున్నాక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి సరికొత్త విప్లవానికి నాంది పలికారని అంటున్నారు. ఇప్పుడు అదే బాటలో నడుస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేశ్ రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా అత్యంత కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చారని అంటున్నారు.
‘రాజకీయాల్లో మహిళలు కేవలం లబ్ధిదారులుగా మాత్రమే మిగిలిపోకూడదు, వారు నిర్ణేతలుగా మారాలి అన్న భావనతో పార్టీలో వచ్చే ఎన్నికల నాటికి 33 శాతం రిజర్వేషన్ల విధానాన్ని తీసుకువస్తున్నట్లు లోకేశ్ ప్రకటించారు. ఇదే తన బిగ్ అనౌన్సెమెంట్ అంటూ తేల్చిచెప్పారు. ఇటీవల పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ మిత్రపక్షంగా టీడీపీ ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ సమీకరణాల వల్ల ఆ బిల్లుల ప్రక్రియ, డీలిమిటేషన్ ఆలస్యమవుతూ వస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును పూర్తిగా చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉందని లోకేశ్ గుర్తు చేశారు. పార్లమెంట్ బిల్లు పాస్ అయినా, కాకపోయినా ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే 2029 ఎన్నికల్లో మహిళలకు కనీసం 33 శాతం సీట్లు కేటాయించి తీరాలని ఆయన మహానాడులో ప్రతిపాదించారు. ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టి క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.
‘స్త్రీశక్తి’ థీమ్ తో టీడీపీ 44వ మహానాడును నిర్వహిస్తోంది. వర్చువల్ గా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో రాష్ట్రవ్యాప్తంగా కేడర్ ఉత్సాహంతో పాల్గొంటున్నారు. ఇక మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ఈ సారి మహానాడును స్త్రీ శక్తి థీమ్ తో నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ పరంగా మహిళా రిజర్వేషన్ అమలుకు తీర్మానం ప్రవేశపెట్టినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దేశంలో ఒక చర్చగా మారిపోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి ప్రభుత్వపరంగా అమలు చేసినా, చేయకపోయినా తాము మాత్రం మహిళా కోటాను అమలు చేస్తామని ప్రకటించడంతో సరికొత్త రాజకీయ చరిత్ర మొదలైందని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
