Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాటజీ మాములుగా లేదుగా !

తాజాగా విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన తర్వాత ఆయన స్వయంగా ఆ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో నేరుగా చర్చించడం, నగర అభివృద్ధి దిశలో తమ అభిప్రాయాలు తెలుసుకోవడం విశేషంగా నిలిచింది.

By:  Tupaki Desk   |   31 Aug 2025 1:25 PM IST
ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాటజీ మాములుగా లేదుగా !
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ శైలిలో గణనీయమైన మార్పు స్పష్టమవుతోంది. గతంలో ఆయన పర్యటనలు సాధారణంగా అధికారిక కార్యక్రమాలకు పరిమితం అయ్యేవి. భద్రతా కారణాలు, పాలనా ఒత్తిడులు ఎక్కువగా ఉండడంతో ప్రజలతో పెద్దగా సమయాన్ని గడపలేకపోయారు. కేవలం కొద్దిపాటి సంభాషణలతోనే ఆయన తిరిగి వెళ్ళిపోవడం సాధారణం. అయితే, ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజల మధ్య ఎక్కువ సమయం గడుపుతూ, వారితో మమేకమవుతూ, ఒక సాధారణ వ్యక్తిలా వ్యవహరిస్తున్నారు.

మా సీఎం అనిపించుకునేలా ..

ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లడం, వారితో కూర్చొని మాట్లాడడం, టీ–కాఫీలు పంచుకోవడం వంటి చర్యలు ప్రజలలో సాన్నిహిత్యం పెంచుతున్నాయి. దీని వల్ల చంద్రబాబు “మా సీఎం” అనిపించే స్థాయిలో ప్రతి ఒక్కరి దృష్టిలో చేరువ అవుతున్నారు. ముఖ్యంగా మహిళలతో మరింతగా కాంటాక్ట్ సాధించడానికి ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన్ని ఉపయోగిస్తున్నారు. తాను బస్సు ఎక్కి వారితో ప్రయాణించడం ద్వారా వారి సమస్యలు, అభిప్రాయాలు నేరుగా వింటున్నారు.

ప్రజలతో మాటామంతి...

తాజాగా విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన తర్వాత ఆయన స్వయంగా ఆ బస్సులో ప్రయాణించి ప్రయాణికులతో నేరుగా చర్చించడం, నగర అభివృద్ధి దిశలో తమ అభిప్రాయాలు తెలుసుకోవడం విశేషంగా నిలిచింది. అంతేకాకుండా కుప్పంలో స్థానిక ఆర్టీసీ బస్సు ఎక్కి, రైతులు మరియు మహిళలతో కలసి ప్రయాణిస్తూ వారి సమస్యలు తెలుసుకోవడం ఆయన కొత్త స్టైల్‌లోని ముఖ్యమైన అంశం.

నేరుగా తెలుసుకునేందుకే

ఈ విధానం ద్వారా చంద్రబాబు తన పాలనను కేవలం పైస్థాయి నిర్ణయాలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రజల అంచనాలను నేరుగా తెలుసుకునే దిశగా మార్చారు. ప్రజలతో మమేకం అవుతూ, పాలనలో వారిని భాగస్వాములను చేస్తున్నారన్న భావన కలుగుతోంది. ఫలితంగా “ప్రజా సీఎం – మన సీఎం” అనే ఇమేజ్ మరింత బలపడుతోంది.

నేరుగా ఫీడ్ బ్యాక్

చంద్రబాబు ఇప్పుడు అమలు చేస్తున్న ఈ స్ట్రాటజీ రెండు కోణాలలో ప్రభావం చూపుతోంది. ఒకవైపు ప్రజల్లో తన పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడమే కాకుండా, మరోవైపు ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాలపై నేరుగా ఫీడ్‌బ్యాక్ అందుకుంటున్నారు. ఇది రాజకీయంగా ఆయనకు లాభం చేకూర్చే అంశం కావడం ఖాయం.