నారా బ్రాహ్మణికి అరుదైన గౌరవం
నందమూరి , నారా కుటుంబాల నుంచి మహిళలు వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే నందమూరి పురందేశ్వరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. కేంద్రమంత్రిగా.. ఏపీ బీజేపీ చీఫ్ గా పనిచేసి తమ సత్తా చాటారు.
By: A.N.Kumar | 14 Dec 2025 12:56 PM ISTనందమూరి , నారా కుటుంబాల నుంచి మహిళలు వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే నందమూరి పురందేశ్వరి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ.. కేంద్రమంత్రిగా.. ఏపీ బీజేపీ చీఫ్ గా పనిచేసి తమ సత్తా చాటారు. మరోవైపు నారా భువనేశ్వరి వ్యాపారంలో తమదైన ముద్ర వేయడంతోపాటు ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే నారా బ్రాహ్మణి కూడా వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె ఒక ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకొని కుటుంబానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన మహిళా వ్యాపారవేత్త అవార్డును ఆమె దక్కించుకున్నారు.
బిజినెస్ టుడే పురస్కారం..
ప్రముఖ వాణిజ్య పత్రిక బిజినెస్ టుడే ఏటా అందించే ఈ ప్రతిష్టాత్మక అవార్డును 2025-26 సంవత్సరానికి గాను నారా బ్రాహ్మణికి అందించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ ఏడాది సుమారు 22 మంది మహిళా వ్యాపారవేత్తలు పోటీపడగా.. నారా బ్రాహ్మణి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఈ గౌరవాన్ని పొందారు. పురస్కారం దక్కిన సందర్భంగా బ్రాహ్మణి ఆనందం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామిక , వాణిజ్య, వ్యాపారవేత్తలను గుర్తించి ప్రోత్సహిస్తున్న బిజినెస్ టుడే పత్రికకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
హెరిటేజ్ ఫుడ్స్ లో కీలక పాత్ర
నారా బ్రాహ్మణి ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. 1989లో నారా చంద్రబాబు నాయుడు ఈ సంస్థను స్థాపించారు. ఆయన రాజకీయాల్లో బిజీగా మారిన తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి సంస్థ బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత లోకేష్ కూడా కొంతకాలం కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. లోకేష్ వివాహం అనంతరం.. బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలను తమ భుజాలపై వేసుకొని సంస్థను దేశంలోనే అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె నాయకత్వంలో హెరిటేజ్ ఫుడ్స్ దేశంలోనే వివిధ రాష్ట్రాలకు తన కార్యకలాపాలను విస్తరిస్తోంది.
సేవా కార్యక్రమాలలోనూ అగ్రగామి
వ్యాపారవేత్తగా తన ప్రతిభను చాటుకోవడమే కాకుండా.. నారా బ్రాహ్మణి సామాజిక సేవలో కూడా పాలుపంచుకుంటున్నారు. ఆమె బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ట్రస్ట్ లో బోర్డు మెంబర్ గా వ్యవహరిస్తున్నారు. ఇందుకోసం ఆమె వారానికి ఒక రోజును ఆస్పత్రి సేవలకు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.
వ్యాపారం, సామాజికసేవ ఈ రెండు రంగాల్లోనూ తన బహుముఖ పత్రిభను ప్రదర్శిస్తూ నారా బ్రాహ్మణి దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తలందరికీ ఆదర్శంగా నిలిచారు.
