Begin typing your search above and press return to search.

ఉచిత విద్యుత్ హామీపై చంద్రబాబు ఏమన్నారంటే... నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇస్తే వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని సీఎం సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   30 July 2026 1:14 AM IST
ఉచిత విద్యుత్ హామీపై చంద్రబాబు ఏమన్నారంటే... నారా భువనేశ్వరి కీలక వ్యాఖ్యలు
X

ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇస్తే వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని సీఎం సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దృఢ సంకల్పం చంద్రబాబు సొంతమని ఆమె వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడో రోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొన్నారు. శాంతిపురం మండలం వసనాడులో గంగమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

మహిళలతో సమావేశమైన భువనేశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. కుప్పం నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువస్తున్నారని, అదే మాదిరిగా రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నడూ లేనట్లు చంద్రబాబు రాజకీయ జీవితంలో తాను చూసిన కోణాలను ఆవిష్కరించారు.

2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానా ఖాళీగా ఉందని, చంద్రబాబు ఏం చేశారో తెలియదు కానీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారని భువనేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా గతంలో చంద్రబాబు చెప్పిన మాటలను మహిళలతో పంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి పోటాపోటీగా పనిచేశారని, ఆ సమయంలో ఉచిత విద్యుత్ హామీ ఇద్దామని పార్టీ నేతలు చంద్రబాబుకు సూచిస్తే ఆయన తిరస్కరించారని అన్నారు. కానీ, అదే హామీతో రాజశేఖరరెడ్డి గెలిచి సీఎం అయ్యారని తెలిపారు. సీఎంగా గెలిచిన తర్వాత ఉచిత విద్యుత్ హామీని రాజశేఖరరెడ్డి నెరవేర్చలేకపోయారని అన్నారు.

దీనిని బట్టి చంద్రబాబు హామీ ఇస్తే వెనకడుగు వేయరన్న విషయం అర్థం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళిపోతే చంద్రబాబు ఎవరి కాళ్లు పట్టుకున్నారో కానీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని, అదీ ఆయన గొప్పతనమని భువనేశ్వరి వ్యాఖ్యానించారు. కాగా, రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరి తన పంథా మార్చుకున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుతో కలిసి పయనిస్తున్న భువనేశ్వరి గతంలో ఎప్పుడూ ఇలా రాజకీయ కారక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేదు. కానీ ఇప్పుడు కుప్పం బాధ్యతలను పూర్తిగా తన భుజానికెత్తుకోవడమే కాకుండా తన భర్త పడిన కష్టాన్ని, ప్రజల కోసం పరితపించే గుణాన్ని వివరిస్తూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.