Begin typing your search above and press return to search.

ఈసారి మీరు పోటీ చేస్తారా మేడం: భువ‌నేశ్వ‌రికి బిగ్ ఆఫ‌ర్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అవాక్క‌య్యే సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

By:  Garuda Media   |   28 July 2026 4:26 PM IST
ఈసారి మీరు పోటీ చేస్తారా మేడం: భువ‌నేశ్వ‌రికి బిగ్ ఆఫ‌ర్‌
X

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అవాక్క‌య్యే సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం ఆమె సీఎం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. వ‌రుస‌గా నాలుగు రోజులు ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌కు సోమ‌వారం వ‌చ్చిన ఆమె.. స్థానికంగా ఉన్న నాలుగు మండ‌లాల‌లో ప‌ర్య‌టించే ప్ర‌ణాళిక వేసుకున్నారు. తొలి రోజు వ‌చ్చీరావడంతోనే ఇటీవ‌ల నారా ఫ్యామిలీ ద‌త్త‌త తీసుకున్న రామ‌కుప్పం మండలంలోని గ్రామాల్లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌లు ఆమెకు హార‌తులు ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు.

అనంతరం.. స్థానికంగా ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌తో ల‌బ్ధి పొందుతున్న‌వారితో భువ‌నేశ్వ‌రి భేటీ అయ్యారు. వారితో పిచ్చాపాటీ మాట‌లు క‌లిపారు. కుటుంబాల గురించి, ఆదాయాల గురించి కూడా వాక‌బు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆరోగ్య భ‌ద్ర‌త‌కు సంబంధించి కూడా ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు మ‌హిళ‌లు.. భువ‌నేశ్వ‌రిని ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ''వ‌చ్చే ఎన్నిక‌ల‌లో మీరు పోటీ చేస్తారా మేడం'' అని వారు ప్ర‌శ్నించే స‌రికి భువ‌నేశ్వ‌రి అవాక్క‌య్యారు. అంతేకాదు.. రాజ‌కీయాల్లోకి మారు కూడా రావాల‌ని ఆమెకు వారు సూచించారు. కుప్పం నుంచి పోటీచేస్తే.. ఘ‌న విజ‌యం సాధిస్తార‌ని మ‌రి కొంద‌రు మ‌హిళ‌లు చెప్పారు.

మొత్తంగా ఈ చ‌ర్చ రాజ‌కీయం దిశ‌గా అడుగులు వేయ‌డం ప్రారంభ‌మైంద‌ని గ‌మ‌నించిన భువ‌నేశ్వ‌రి.. త‌న‌కు రాజ‌కీయాల‌పై ఇంట్ర‌స్టు లేద‌ని, ఇప్ప‌టికే ఫ్యామిలీలో ఇద్ద‌రు(సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేష్‌) రాజ‌కీయాల్లో ఉన్నార‌ని.. తాను రాలేన‌ని తేల్చి చెప్పారు. అయితే, ఎక్క‌డైనా స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం స్పందిస్తాన‌ని చెప్పారు. గ‌తంలో తాను చేసిన పాద‌యాత్రను ఈ సంద ర్భంగా భువ‌నేశ్వ‌రి గుర్తుచేసుకున్నారు. `నిజం గెలవాలి` పేరుతో తాను 2023-24 మ‌ధ్య చేప‌ట్టిన యాత్ర‌ను ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో ఆద‌రించార‌ని ఆమె తెలిపారు. కుప్పం ప్ర‌జ‌ల‌కు తాను ఎప్ప‌టికీ రుణప‌డి ఉంటాన‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఎంతో చేయాల్సి ఉంద‌న్నారు.

ఇప్ప‌టికే ఎన్టీఆర్ ట్ర‌స్టు ద్వారా ప్ర‌తి ఇంట్లో మ‌హిళ‌ను ఉపాధి దిశ‌గా ముందుకు న‌డిపిస్తున్నామ‌ని భువ‌నేశ్వ‌రి తెలిపారు. అయితే.. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తాను రాబోన‌న్నారు. మ‌హిళ‌ల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా ఉంటాన‌ని తేల్చి చెప్పారు. త్వ‌ర‌లోనే కుప్పంలో ప్ర‌త్యేక టూరిజం స్పాట్‌ను ఏర్పాటుచేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఈ నియోజ‌వ‌ర్గాన్ని రాష్ట్రంలోనే నెంబ‌ర్ 1 చేసేందుకు సీఎం చంద్ర‌బాబు త‌పిస్తున్నార‌ని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు. కాగా.. గ‌తంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు కూడా శాంతిపురం మండ‌లంలో మ‌హిళ‌లు భువ‌నేశ్వ‌రిని రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరారు. అప్ప‌ట్లోనూ ఆమె సున్నితంగా తిర‌స్క‌రించారు.