కుప్పం ఎమ్మెల్యే మీరేనా? బస్సులో భువనేశ్వరికి షాకిచ్చిన మహిళలు
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటన కొనసాగుతోంది.
By: Tupaki Desk | 21 Nov 2025 7:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటన కొనసాగుతోంది. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన భువనేశ్వరి శాంతిపురంలోని సొంత ఇంట్లో వరుసగా మూడో రోజూ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పిల్లలను ముద్దాడటం, వికలాంగుల సమస్యలను తెలుసుకోవడం ద్వారా ప్రజలను ఆకట్టుకున్నారు. ఇక నడింపల్లి గ్రామంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన భువనేశ్వరి వారితో సరదాగా కోలాటం ఆడారు. అంతేకాకుండా అక్కడి మహిళలతో తమిళ్ లో మాట్లాడి ఆశ్చర్య పరిచారు.
కుప్పంలో మూడో రోజు గడిపిన భువనేశ్వరి శుక్రవారం తన పర్యటనను ఆద్యంతం ఆహ్లాదకరంగా కొనసాగించారు. శాంతిపురంలో నివాసం వద్ద ఆర్టీసీ ఉచిత బస్సును నిలిపి సాధారణ ప్రయాణికురాలిలా ప్రయాణించారు. తుమ్మిసి పెద్ద చెరువు వరకు అదే బస్సులో ప్రయాణించారు. చెరువు నీళ్లకు జలహారతి సమర్పించారు. తీవ్ర వర్షాభావం ఎదుర్కొంటున్న కుప్పానికి శ్రీశైలం నీళ్లు తెచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు తన హామీని నిలబెట్టుకున్నారని కొనియాడారు.
ఇక ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించిన భువనేశ్వరి మహిళలతో సరదాగా సంభాషించారు. ఆర్టీసీ బస్సు ఎక్కిన వెంటనే మహిళా కండెక్టర్ టికెట్ తీసుకోవాల్సిందిగా కోరితే, అదేంటి మహిళలకు ఉచితం అన్నారు కదా? టికెట్ ఎందుకు తీసుకోవాలని సరదాగా ప్రశ్నించారు భువనేశ్వరి. ఉచితమైనా ఆధారుకార్డు చూపి టికెట్ తీసుకోవాలి మేడం అంటూ కండెక్టర్ బదులు ఇవ్వడంతో తన వద్ద కార్డు లేదని చెప్పారు. కార్డు తప్పకుండా ఉండాలని కండెక్టర్ చెబితే.. నవ్వుకుంటూ తన సహాయకుల వద్ద ఉన్న ఆధార్ కార్డును చూపించి టికెట్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలతో సీఎం సతీమణి భువనేశ్వరి ముచ్చట్లాడారు. చంద్రబాబు ఫ్రీ బస్సు అంటున్నారు కదా? ఎలా అమలు చేస్తున్నారో తెలుసుకుందామని వచ్చినట్లు మహిళలతో చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు. ఓ మహిళ గతంలో భువనేశ్వరితో దిగిన ఫొటోను తన ఫోన్ వాల్ పేపరుగా పెట్టుకున్నట్లు చూపితే.. నా ఫొటో ఎందుకు మీ బాబు అన్న ఫొటో పెట్టుకోవాలి కదా? అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
కాగా, ఓ మహిళ నెక్ట్స్ కుప్పం ఎమ్మెల్యే మీరేనా మేడం అంటూ ప్రశ్నించారు. అయ్యో నేనెందుకు చంద్రబాబు ఉండగా అంటూ భువనేశ్వరి ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు రిటైర్ అయితే కుప్పం ఎమ్మెల్యేగా మీరే రావాలంటూ భువనేశ్వరిని మహిళలు కోరారు. ఇలా బస్సులో గడిపిన సమయం అంతా భువనేశ్వరి ఆద్యంతం అందరితో కలివిడిగా మాట్లాడుతూ గడిపేశారు. తనకు కుప్పం చాలా నచ్చిందని, ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గోల తప్పిందని అన్నారు.
