Begin typing your search above and press return to search.

నంద్యాలలో నో ఎంట్రీ...బాబు సంకేతం ఇదేనా...?

నంద్యాల ను భూమా ఫ్యామిలీ వదులుకోవాల్సిందే అన్న సంకేతాన్ని టీడీపీ పెద్దలు క్లారిటీగా పంపారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2023 1:38 PM GMT
నంద్యాలలో నో ఎంట్రీ...బాబు సంకేతం ఇదేనా...?
X

రాయలసీమ జిల్లాల లో నంద్యాల ప్రముఖ రాజకీయ స్థావరం. ఎంతో మంది దిగ్గజ నేతల కు రాజకీయ ఆశ్రయం ఇచ్చిన హాట్ సీటు. అలాంటి చోట భూమా కుటుంబానికి షాక్ ఇచ్చేలా టీడీపీ వ్యవహరిస్తోంది అని అంటున్నారు. తాజాగా నంద్యాల నియోజకవర్గం నేతల తో పార్టీ స్థితిగతుల ను సమీక్ష చేసేందుకు చంద్రబాబు అక్కడి నాయకుల కు ఆహ్వానం పంపారు.

ఆ లిస్ట్ లో భూమా అఖిలప్రియ కానీ ఆమె సోదరుడు జగత్ విఖ్యాతి రెడ్డి కానీ లేకపోవడం విశేషం. తన తండ్రికి తానే రాజకీయ వారసుడి ని అని నంద్యాల లో అంతా తానే చూస్తాను అని ఈ మధ్యనే అక్కడ జగత్ విఖ్యాత్ పర్యటించారు. అఖిలప్రియ కూడా తన కు ఆళ్ళగడ్డ ఉన్నా నంద్యాల లో పట్టు కోసం చేయని ప్రయత్నం లేదు.

ఆమె ఏకంగా ఒక టీడీపీ ఆఫీసునే అక్కడ సొంతంగా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. తన వర్గం వారిని దగ్గరుండి తీసుకుని వెళ్ళి లోకేష్ చేత కండువా కప్పిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే లోకేష్ నంద్యాల పాదయాత్ర వేళ ఎంతటి రచ్చ జరిగిందో తెలిసిందే. అఖిలప్రియ వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి ఎపిసోడ్ ఏపీ జనం అంతా చూసారు.

నంద్యాల లో టీడీపీ కి గట్టి నేతలు ఉన్నారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే అఖిల ప్రియ కజిన్ బ్రదర్ అయిన భూమా బ్రహ్మానందరెడ్డి కూడా 2024 ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ ఫరూఖ్ కీలకంగా ఉన్నారు. ఇలా వారందరూ ఉండగా తన తండ్రి సీటు తమకే దక్కాలీ అన్న పంతంతో అఖిలప్రియ చూస్తున్నారు.

ఆమెకు అధినాయకత్వం ఆళ్లగడ్డ బాధ్యతలు అప్పగించింది. ఆమె వాటి ని ముందు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. అయితే ఆళ్ళగడ్డ లో టీడీపీ గ్రాఫ్ ఏ మాత్రం పెరగకపోగా నంద్యాల లో ఆమె పర్యటిస్తూ అక్కడ టీడీపీ లో వర్గ పోరుని పెంచుతున్నారు అని హై కమాండ్ కి నివేదికలు వెళ్తున్నాయి.

ఈ నేపధ్యంలో అఖిలప్రియ మీద నంద్యాల టీడీపీ నేతలు కూడా పలు మార్లు హై కమాండ్ కి ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఇవన్నీ చూసిన అధినాయకత్వం అఖిలప్రియను నంద్యాల రాకుండా నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందా అన్నది చర్చకు వస్తోంది. వచ్చే ఎన్నికలో భూమా బ్రహ్మానందరెడ్డి కేనీ ఫరూఖ్ ఫ్యామిలీ నుంచి కానీ క్యాండిడేట్ సిద్ధం అవుతారు అని అంటున్నారు.

ఆళ్ళగడ్డ విషయం తీసుకుంటే అక్కడ అఖిలప్రియ కజిన్ బీజేపీ లో ఉన్న భూమా కిషోర్ రెడ్డి రాజకీయంగా ముందున్నారు. ఎన్నికల వేళకు పొత్తులు కుదిరితే బీజేపీ కి ఈ టికెట్ వెళ్తుందా అన్న చర్చ సైతం సాగుతోంది. మొత్తానికి ఇవన్నీ చూస్తూంటే నంద్యాల ను భూమా ఫ్యామిలీ వదులుకోవాల్సిందే అన్న సంకేతాన్ని టీడీపీ పెద్దలు క్లారిటీగా పంపారని అంటున్నారు. అదే విధంగా ఆళ్ళగడ్డలో సెట్ చేసుకుని గ్రాఫ్ పెంచుకోకపోతే ఆ టికెట్ కూడా డౌట్ లో పడినా ఆశ్చర్యం లేదు అంటున్నారు.