Begin typing your search above and press return to search.

భారతరత్నకు అన్న గారు బహు దూరం...!

అన్న నందమూరి తారక రామారావు జీవితం రెండు భాగాలుగా చూడాలి. అందులో ఒకటి ఆయన మూడున్నర దశాబ్దాల సినీ జీవితం.

By:  Tupaki Desk   |   24 Jan 2024 11:07 AM GMT
భారతరత్నకు అన్న గారు బహు దూరం...!
X

అన్న నందమూరి తారక రామారావు జీవితం రెండు భాగాలుగా చూడాలి. అందులో ఒకటి ఆయన మూడున్నర దశాబ్దాల సినీ జీవితం. అది అద్భుతంగా సాగింది. పౌరాణిక పాత్రలకు సరిసాటిగా ఎన్టీయార్ అనిపించుకున్నారు. రాముడు క్రిష్ణుడు వెంకటేశ్వరుడు అంటే ఎన్టీయార్ అనిపించారు. దేవుడి రూపాలను ఆయనలో జనాలు చూసుకున్నారు.

చారిత్రాత్మక పాత్రలతో పాటు జానపదాలకు ఎన్టీయార్ జీవం పోశారు. రాజు అంటే ఇలా ఉండాలి అని అంతా అనుకునేలా ఆయా పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. శ్రీక్రిష్ణ దేవరాయలు అంటే ఎన్టీయార్ రూపమే గుర్తుకు వస్తుంది. సాఘీకాలలో సైతం ఎన్టీయార్ చేసినన్ని వైవిద్య భరితమైన పాత్రలు ఎవరూ చేయలేదు. ప్రతినాయక పాత్రలు అయిన దుర్యోధనుడు, రావణాసురుడు వంటి పాత్రలలో ఆయన ఇమిడిపోయారు. కేవలం నటుడిగా మాత్రమే ఎన్టీయార్ మిగిలిపోలేదు, దర్శకుడిగా విశేష కీర్తిని ఆర్జించారు.

నిర్మాతగా సందేశాత్మక చిత్రాలను తీశారు. వర్తమాన సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారాలను ఆయన సినిమాల్లో చూపించారు. స్టూడియో అధినేతగా ఆయన కొనసాగారు. ఎగ్జిబిటర్ గా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమలో మొత్తం కనిపించారు. అన్నింటా ప్రతిభ చూపించారు. ఇది సినీ నేపధ్యం నుంచి చూసినపుడు ఎన్టీయార్ ఘనత. అందుకు గానూ ఆయనకు కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే దక్కింది.

ఇక రాజకీయాల్లో చూసుకుంటే అనితర సాధ్యమైన రికార్డు ఆయన సొంతం. అది గిన్నీస్ రికార్డు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారు. మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఈ విధంగా తీసుకుంటే ఎన్టీయార్ 1984లో కేంద్రంలో 35 ఎంపీ సీట్లతో ప్రతిపక్ష పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్ ని స్థాపించి కాంగ్రెసేతర కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా చూశారు.

ముఖ్యమంత్రి ఏడున్నరేళ్ళ పాటు పాలించారు. నాలుగు సార్లు ప్రమాణం చేశారు. 1994లో అయితే మొత్తం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి 26 సీట్లు మాత్రమే దక్కాయి. టీడీపీకి సొంతంగా 225 వస్తే మిత్రులకు మిగిలిన సీట్లు లభించాయి. అంతలా రాజకీయాల్లో తన ప్రభంజనం చూపించి తెలుగు వారి నిలువెత్తు సంతకం అయ్యారు. పాలనలో కూడా సామాన్యులకు బడుగులకు ఆయన పెద్ద పీట వేసి కూడు గూడు గుడ్డ అన్న మూడు ప్రధాన అవసరాలను తీర్చడానికి సంక్షేమ పధకాలు ఎన్నో పెట్టారు. వెనకబడిన వారికి వెన్నెముకగా నిలిచారు.

ఎందరికో రాజకీయంగా అవకాశాలు ఇచ్చి వారిని ముందు వరసలోకి తెచ్చారు. మరి ఎంటీయార్ ని రాజకీయ సామాజిక సంస్కరణశీలింగా కూడా చెప్పుకోవచ్చు కదా. ఇలా ఒకే జీవితంలో రెండు విభిన్న రంగాలలో రాణించి ఎవరికీ చెందని రికార్డులను సొంతం చేసుకున్న ఎన్టీయార్ కి భారత రత్న బిదుదు ఎందుకు బహు దూరంలో ఉండిపోతోంది అన్నది సామాన్యుడికి కలిగే బాధ ఆవేదన.

ఎన్టీయార్ శతజయంతి వేడుకలు గత ఏడాది జరిగాయి. ఆ సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న వెండి నాణేణ్ణి రాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రతీ తెలుగువారూ అది చూసి ఉప్పొంగిపోయారు. అయితే అదే సమయంలో ఆయనకు భారత రత్న కూడా ప్రకటించి ఉంటే ఎంత బాగుండేది అన్నది అందరి మాట.

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముందే భారత రత్న గౌరవం బీహార్ కి చెందిన మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్ కి దక్కింది. ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీహారీలు ఆయనను జన నాయక్ అని పిలుస్తారు. ఆయన వెనుకబడిన వర్గాల కోసం ఎంతో తపన తాపత్రయం పడ్డారు. నిజంగా ఆయనకు ఆ గౌరవం దక్కాల్సిందే. ఆయన శత జయంతి వేడుకల సందర్భం ఇది. ఆయనకు అలా గొప్ప గౌరవం దక్కింది. అంతా సంతోషిస్తున్నారు.

తెలుగు వారి వెలుగుగా ఉన్న ఎన్టీయార్ కి కూడా ఆయన శత జయంతి వేడుకల వేళ ఇదే విధంగా భారత రత్న ప్రకటించి ఉంటే బాగుండేది కదా అన్నది అందరి భావన. ఎన్టీయార్ కి భారత రత్న అన్న నినాదానికి పాతికేళ్ల వయసు పై దాటిపోయింది. తప్పు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆయన పేరుతో ఉన్న తెలుగుదేశం ఏపీలో కీలకంగా ఉంది. ఆయన సొంత కుమార్తె ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. పదేళ్లుగా ఆమె అదే పార్టీలో ఉన్నారు. కేంద్రంలో పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది.

మరి ఎన్టీయార్ కి ఎందుకు భారత రత్న దక్కదు అన్నది ఎవరికి వారే ఆలోచించాల్సిన సమయం. ఎన్టీయార్ ఈ లోకంలో లేరు. ఆయనకు భారత రత్న ప్రకటిస్తే తెలుగు జాతి మొత్తం సంతోషిస్తుంది. తలెత్తుకుని తిరుగుతుంది. దక్షిణాది నుంచి ఇంతటి ప్రతిభావంతుడు మళ్లీ పుట్టరు అన్నది చరిత్ర చెప్పే సత్యం. ఇప్పటికైనా మించినది లేదు. ఎన్టీయార్ కి భారత రత్నకు కృషి చేయాలి. అది ఆయనకు దక్కాలి. నూరు శాతం అందుకు ఆయన అర్హుడు అన్నది కూడా అంతా ముక్త కంఠంతో చెబుతున్న మాట.