Begin typing your search above and press return to search.

ఎన్టీయార్ చిన్న కొడుకు విశాఖలో...?

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీయార్ తెలుగు వారి వెలుగు జ్యోతి అన్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2023 10:27 AM GMT
ఎన్టీయార్  చిన్న కొడుకు విశాఖలో...?
X

విశాఖకు ఎన్టీయార్ చిన్న కుమారుడు నందమూరి రామక్రిష్ణ వచ్చారు. ఆయన చుట్టూ తెలుగుదేశం సీనియర్ నాయకులు అంతా చేరారు. ఎన్టీయార్ శత జయంతి ఉత్సవాలకు ఈ ఏడాది మే 28తో ముగింపు పలికినా విశాఖలో మాత్రం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీయార్ సమాలోచన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రామక్రిష్ణ వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీయార్ తెలుగు వారి వెలుగు జ్యోతి అన్నారు. ఎన్టీయార్ తెలుగు జాతి ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటారని కొనియాడారు. ఇక ఎన్టీయార్ టికెట్లు ఇవ్వడంతో ఆనాడు ఎమ్మెల్యేలుగా తరువాత కాలంలో మంత్రులుగా అయిన సీనియర్లు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్టీయార్ తమ లాంటి వారిని ఎందరినో రాజకీయంగా ప్రోత్సహించారు అని పేర్కొన్నారు.

ఆనాడు పాతికేళ్ల ప్రాయంలో ఉన్న వారిని రాజకీయాల్లోకి తెచ్చి వారిని మంత్రులు గా చేసిన ఘనత ఎన్టీయార్ ది అని వారు వెల్లడించారు. ఎన్టీయార్ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకుని వచ్చారని అన్నారు. ఇదిలా ఉంటే ఎన్టీయార్ తనయుడు విశాఖ రావడం ఆయన తో చాలా కాలంగా టీడీపీలో కనిపించని నేతలు అంతా భేటీ కావడం పట్ల చర్చ సాగుతోంది.

రామక్రిష్ణకు రాజకీయాల మీద ఆసక్తి ఏమైనా ఉందా అన్న చర్చ కూడా మునుకు వస్తోంది. ఎన్టీయార్ ఫ్యామిలీలో బాలక్రిష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రామక్రిష్ణ మాత్రం రాజకీయాల్లో ఇప్పటిదాకా చురుగ్గా లేరు. అయితే గత ఏడాది కాలంగా ఆయన ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉత్సవాలు ముగిసినా విశాఖ వచ్చారు ఎన్టీయార్ సమాలోచనలు పేరుతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో బాలయ్యతో పాటు ఎన్టీయార్ ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరు ఎన్నికల గోదా లోకి దిగవచ్చు అని వార్తలు వస్తున్నాయి. రామక్రిష్ణకు కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉందని అంటున్నారు. రాయలసీమలో బాలయ్య చంద్రబాబు పోటీ చేస్తున్నారు కోస్తాలో లోకేష్ మంగళగిరి నుంచి బరిలో ఉంటారు. ఇక ఉత్తరాంధ్రా నుంచి రామక్రిష్ణ ఏమైనా పోటీ చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఇక ఎన్టీయార్ తో పాటు ఆయన పెద్ద కుమారుడు కూడా ఉత్తరాంధ్రా నుంచి గతంలో పోటీ చేశారు. ఎన్టీయార్ 1994లో ఉత్తరాంధ్రాలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక నందమూరి జయక్రిష్ణ లక్ష్మీ పార్వతి పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా 1996లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు.

ఇపుడు రామక్రిష్ణ చూపు ఉత్తరాంధ్రా మీద ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన సేవలను పార్టీ వాడుకుంటుందా అన్నది చూడాలి. సీనియర్ ఎన్టీయార్, బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్స్ తో మంచి రిలేషన్స్ ఉన్న రమాక్రిష్ణ కనుక రంగంలోకి దిగితే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసినా చేయవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఇది గాసిప్ గా మిగిలిపోతుందా లేక ఈ ప్రచారంలో నిజం ఉందా అన్నది తరువాత నెలలలో తేలనుంది.