Begin typing your search above and press return to search.

నందలూరులో అసలేం జరిగింది? గాల్లో కాల్పుల వరకు అభ్యర్థి వెళ్లటమా?

ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఉదంతాల్లో ఎక్కువగా అధికార టీడీపీ.. విపక్ష వైసీపీ మధ్య అధిపత్య పోరు.. దాడులు.. ప్రతిదాడులు.

By:  Garuda Media   |   23 Oct 2026 12:44 PM IST
నందలూరులో అసలేం జరిగింది? గాల్లో కాల్పుల వరకు అభ్యర్థి వెళ్లటమా?
X

ఏపీలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు షాక్ కు గురి చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఉదంతాల్లో ఎక్కువగా అధికార టీడీపీ.. విపక్ష వైసీపీ మధ్య అధిపత్య పోరు.. దాడులు.. ప్రతిదాడులు. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవటం తెలిసిందే. కొన్నిచోట్ల మాత్రం ఆయా పార్టీల్లోని అంతర్గత విభేదాలు సొంత పార్టీ నేతల మధ్య రచ్చకు కారణమైన ఉదంతాలు ఉన్నాయి.

ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే టీడీపీలో తాజాగా చోటు చేసుకున్న ఉదంతం చూస్తే.. పార్టీ గీత దాటే వారిపై అధినేత చూసిచూడనట్లుగా ఉండటం ఎలాంటి తీవ్ర పరిణామాలకు కారణం అవుతున్నాయో అర్థమవుతుంది. ఎవరేం చేసినా క్రమశిక్షణ చర్యలు శూన్యమన్న తీరుతో తెలుగు తమ్ముళ్లు ఎంతలా తెగబడుతున్నారన్న దానికి నిదర్శనంగా నిలిచింది నందలూరులో గురువారం చోటు చేసుకున్న ఉదంతం. తొలుత ఈ ఉదంతం టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య జరిగినదిగా ప్రచారం జరిగినా.. ఆ తర్వాత ఈ ఉదంతంపై పూర్తి క్లారిటీ వచ్చింది.

అధికార టీడీపీలో సొంత పార్టీ నేతల మధ్య జరిగిన అంతర్గత పోరు చివరకు.. ఒక టీడీపీ నేత గాల్లో కాల్పులు జరిపే వరకు వెళ్లటం చూస్తే.. తెలుగు తమ్ముళ్ల బరితెగింపు మరీ ఇంతనా? అన్నట్లుగా మారింది. గురువారం చోటు చేసుకున్న ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లాలోని నందలూరు తెలుగుతమ్ముళ్ల మధ్య అధిపత్య పోరు చివరకు రణరంగంగా మారింది. నందలూరు ఎంపీపీ స్థానాన్ని రిజర్వేషన్లలో భాగంగా జనరల్ మహిళకు కేటాయించారు. నందలూరు 1 ఎంపీటీసీగా టీడీపీ నేత ఎద్దుల విజయసాగర్ భార్య ప్రమీల నామినేషన్ వేశారు. విజయసాగర్ సైతం నందలూరు 2 ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేశారు.

ఇదిలా ఉండగా లేబాక గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆవుల లక్ష్మీనరసమ్మ ఆడపూరు ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ వేసేందుకు గురువారం మధ్యాహ్నాం ఎంపీడీవో కార్యాలయానికి తన కొడుకు ఆవుల బాలసుబ్రహ్మణ్యంతో కలిసి బయలుదేరారు. వీరిని విజయసాగర్.. ఆయన వర్గీయులు నందలూరులోని నేషనల్ హైవే మీద అడ్డుకున్నారు. నందలూరు స్థానానికి తమ వర్గానికి చెందిన అభ్యర్థే నామినేషన్ వేయాలన్న పట్టుదల చివరకు రెండు వర్గాల మధ్య దాడుల వరకు వెళ్లింది. నామినేషన్ వేసేందుకు వెళుతున్న ఆవుల బాలసుబ్రహ్మణ్యం, ఆయన తల్లి లక్ష్మీ నరసమ్మ వాహనాల్ని విజయ్ సాగర్ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య జాతీయ రహదారి మీదర పరస్పరం దాడులు జరిగాయి. ఈ హింసాత్మక ఘర్షణలో రెండు కార్లు.. బైక్ లు ధ్వంసమయ్యాయి. ఒక కారుకు నిప్పు పెట్టారు.

ఈ పోరు తీవ్రరూపం దాల్చిన వేళ.. అక్కడి ఉద్రిక్త వాతావరణంలో గుంపును చెదరగొట్టేందుకు బాలసుబ్రహ్మణ్యం తన వద్ద ఉన్న పిస్టల్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. సుమారు ఐదు రౌండ్ల వరకు గాల్లో కాల్పులు జరపటంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అదనపు బలగాలతో వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో కొందరు పోలీసులు సైతం గాయాలయ్యాయి.

తొలుత ఈ ఉదంతం టీడీపీ.. వైసీపీ వర్గీయుల మధ్య జరిగినట్లుగా ప్రచారం సాగింది. కానీ.. ఆ తర్వాత అధికార టీడీపీలోని రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్నట్లు తెలియటంతో షాక్ కు గురైన పరిస్థితి. టీడీపీ అంతర్గత వర్గపోరు ఇంత స్థాయికి వెళ్లిందా? అన్న చర్చ మొదలైంది. ఈ ఘర్షణకు.. కాల్పులకు ప్రధాన కారణమైన టీడీపీ నేతలు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం.. ఎద్దుల విజయ్ సాగర్ వారి అనుచరుల మీద కేసులు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. అనంతరం ఇరువురిపైనా కేసులునమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారు ఏ వర్గానికి చెందిన వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ఇందుకు తగ్గట్లే ఇరువురు నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాన్ని కలిగి ఉండటం.. దానిని ప్రదర్శిస్తూ బహిరంగ ప్రదేశంలో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ప్రజలను భయాందోళనలకు గురి చేసిన ఉదంతంపై ఆయుధ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు ఘర్షణను అదుపు చేసేందుకు ప్రయత్నించిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ మనోజ్.. ఇతర పోలీసు సిబ్బందిపై దాడి జరగటం.. వారికి గాయాలు కావటంతో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించటం.. వారిపై భౌతిక దాడులకు దిగటం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆస్తి నష్టంతో పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వైనంపైనా కేసులు నమోదు చేశారు. ఏమైనా సొంత పార్టీకి చెందిన నేతలు అధిపత్య పోరులో భాగంగా ఇంతకు తెగబడిన ఉదంతంపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏమైనా.. టీడీపీ ఇమేజ్ ను ఈ ఉదంతం దారుణంగా డ్యామేజ్ చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది.