కేసీఆర్ నుంచి ప్రాణహాని: నందకుమార్ సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు నందకుమార్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 5 Jun 2025 3:43 AMఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు నందకుమార్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బీఆర్ ఎస్ అధినేత, మా జీ సీఎం కేసీఆర్ నుంచి ప్రాణ హాని ఉందన్నారు. అంతేకాదు.. తనను ఎప్పుడైనా లేపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు. ఈ క్రమంలో తనకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆయన వేడుకున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన నందకుమార్.. తనకు రక్షణ కల్పిస్తే.. అసలు ట్యాపింగ్ కేసు విషయాలను అన్నింటినీ బహిర్గతం చేస్తానని చెప్పారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుడినేనని చెప్పారు.
రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు ఉన్నాయని.. ఈ మొత్తం వ్యవహారానికి అప్పటి ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు కారణమని వెల్లడించారు. ప్రస్తుతం ఈయన అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నారని, అయితే.. అంతా ఆయనేనని.. కాబట్టి చిన్న స్టేట్‌మెంటు తీసుకుని ఆయనను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తనకు ప్రాణహాని ఉందన్న ఆయన.. తనను చంపేసేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి ఈ కేసులో అన్ని ఆధారాలు ఆఫీసుల్లోనే ఉన్నాయని..కానీ.. పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. అందుకే.. మూసీనదిలో వెతికారనిచెప్పారు.
ప్రస్తుతం ప్రభాకర్ రావు విచారణ జరగాల్సి ఉందని.. ఆ తర్వాత.. తాను కూడా ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. ``నా ఫోన్ ట్యాప్ అయింది. ఇలా చేయడానికి ఇంటలిజెన్స్ అధికారులు ఎవరి అనుమతి తీసుకున్నారు. ఫోన్ ట్యాప్ చేయకుండా నాకు సంబంధించిన ఆడియోలు కేసీఆర్‌కు ఎలా చేరాయి?`` అని ప్రశ్నించారు. కాగా.. ఈ కేసులో `మ్యాచ్ ఫిక్సింగ్` జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ``ఫోన్ ట్యాపింగ్ కేస్ ఎప్పుడో అయిపోయింది.. జస్ట్ ఫార్మాలిటీస్ కోసం ప్రభాకర్ రావు ఇండియా వస్తున్నారు`` అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ కేసులో ప్రభాకర్‌రావు ఏమేరకు సహకరిస్తారనే విషయం మాత్రం సస్పెన్స్‌లోనే ఉందని నందకుమార్ అనడం గమనార్హం.