Begin typing your search above and press return to search.

నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది అగ్నికి ఆహుతి

హైదరాబాద్ మహానగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి బజార్ ఘాట్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది అగ్నికి ఆహుతి అయ్యారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 11:01 AM GMT
నాంపల్లిలో ఘోర అగ్నిప్రమాదం.. 9 మంది అగ్నికి ఆహుతి
X

హైదరాబాద్ మహానగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి బజార్ ఘాట్ లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో పది మంది వరకు గాయపడొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే.. బజార్ ఘాట్ లోని నాలుగు అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ల గ్యారేజ్ ఉంది. కారు రిపేర్ చేసే సమయంలో మంటలు వచ్చాయి.

అక్కడికి సమీపంలోనే డీజిల్..కెమికల్ డ్రమ్ములు ఉండటం.. ఆ వెంటనే మంటల తీవ్రత అంతకంతకూ ఎక్కువయ్యాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనం పక్కనే అపార్టుమెంట్లు.. షాపులు ఉండటంతో అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల వారు తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు. గ్యారేజ్ లో ఉన్న మిగిలిన కెమికల్ డబ్బాల్ని అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గ్యారేజ్ లో ఉన్న పలు వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

మంటలు పెరిగి.. భవనం మొత్తం వ్యాపించటానికి కారణం మాత్రం రసాయానాలకు నిప్పు అంటుకోవటంతోనేనని చెబుతున్నారు. .ఈ ఘటనలో అపార్టుమెంట్ లో ఉన్న 21 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఎనిమిది మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ భవనంలోని మూడు.. నాలుగు అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. భారీ ఎత్తున మంటలు.. తీవ్రమైన పొగ కారణంగా ఊపిరి ఆడని కారణంగా మరణాలు ఎక్కువగా ఉన్నాయి.

మరణించిన వారిలో ఒక న్యూట్రిషనిస్టు.. ఒక ఐఐటీ విద్యార్థితో పాటు.. మెడికో కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. మరణించిన వారిలో నాలుగురోజుల పసికందు ఉన్నట్లుగా తెలుస్తోంది. నిబంధనలకు విరుద్దంగా నివాసిత ప్రాంతాల్లో రసాయనాల్ని నిల్వ ఉంచటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అగ్నిప్రమాదం చోటు చేసుకున్న కాసేపటికే పోలీసులు ఈ ప్రమాదాన్ని గుర్తించి.. వెంటనే అగ్నిమాపక కేంద్రాన్ని అలెర్టు చేయటంతో పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఉదంతంలో ఇంత ఎక్కువగా మ్రతులు ఉండటానికి కారణం.. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే..కిందకు వచ్చే అవకాశం లేకపోవటం.. భవనాన్ని దట్టమైన పొగలు కమ్మేయటంతో.. ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. ఈ ఘోర ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భాంత్రిని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితుల్నిసమీక్షిస్తున్నారు.