ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదం: కేటీఆర్ సంచలన ఆరోపణలు
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సాక్ష్యాలను భద్రపరిచే నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను దుమారం రేపుతోంది.
By: A.N.Kumar | 7 Feb 2026 6:57 PM ISTతెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన సాక్ష్యాలను భద్రపరిచే నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శనివారం ఉదయం సంభవించిన భారీ అగ్నిప్రమాదం పెను దుమారం రేపుతోంది. కీలకమైన కేసులకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాధారాలు ఈ మంటల్లో బూడిదయ్యాయనే వార్త రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏం జరిగింది?
శనివారం ఉదయం సుమారు 10:21 గంటల సమయంలో ఎఫ్‌ఎస్‌ఎల్ భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట కంప్యూటర్ విభాగంలో ప్రారంభమైన అగ్ని కీలలు, క్షణాల్లో పక్కనే ఉన్న 'సీజ్డ్ ప్రాపర్టీ' స్వాధీనం చేసుకున్న ఆస్తుల గదికి విస్తరించాయి. దాదాపు 50 కంప్యూటర్లు, అనేక హార్డ్ డిస్కులు, కీలక పత్రాలు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఐదు ఫైర్ ఇంజిన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు రెండో అంతస్తులోని కెమికల్ ల్యాబ్‌కు మంటలు వ్యాపించకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది.
కేటీఆర్ సంచలన ఆరోపణలు: "ఇది యాదృచ్ఛికం కాదు.. పక్కా కుట్ర!"
ఈ ప్రమాదంపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం ప్రమాదం కాదని.. సాక్ష్యాలను తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. ఈ అగ్నిప్రమాదం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? 'ఓటుకు నోటు' కేసు ఆడియో ఫైళ్లను మాయం చేయడానికే ఈ మంటలు పుట్టించారా? లేక ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సృష్టించిన తప్పుడు సాక్ష్యాలు ఎక్కడ దొరికిపోతాయన్న భయంతో ఈ పని చేశారా?" అని కేటీఆర్ నిలదీశారు.
దర్యాప్తుపై నీలినీడలు?
ఈ ల్యాబ్‌లో ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులు, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వంటి అత్యంత సున్నితమైన కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు అవి కాలిపోవడంతో ఆయా కేసుల దర్యాప్తు గాలిలో దీపంలా మారుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అధికారుల వెర్షన్ ఏంటంటే?
డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ మంటలు అదుపులోకి వచ్చాయని, ఎంత మేరకు నష్టం జరిగిందనేది క్లూస్ టీమ్ పరిశీలన తర్వాతే తెలుస్తుందని తెలిపారు. ఈ ఘటనపై ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ స్పందించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని.. అయితే లోతైన దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం దీనిని సాధారణ ప్రమాదంగా కొట్టిపారేస్తున్నా.. ప్రతిపక్షాలు మాత్రం వదిలిపెట్టేలా లేవు. ఈ అగ్నిప్రమాదం చుట్టూ ఉన్న రాజకీయ సెగలు మరింత పెరిగే అవకాశం ఉంది.
