Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు.. ‘నమో భారత్’ విశేషాలెన్నో..

వందే భారత్ కు ముందు దేశంలో వేగవంతమైన ట్రైనుగా ‘గతిమాన్ ఎక్స్ ప్రెస్’ను చెప్పేవారు. 2016లో ప్రారంభమైన ఈ ట్రైనును ‘వందే భారత్’ వెనక్కి నెట్టింది.

By:  Tupaki Desk   |   14 Sept 2025 2:00 PM IST
దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు.. ‘నమో భారత్’ విశేషాలెన్నో..
X

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైల్వేశాఖను కొత్త పుంతలు తొక్కిస్తోంది. వేగానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశంలోనే వేగంగా నడిచే మరో రైలు ‘నమో భారత్’ను ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటివరకు వేగంగా పరుగులు తీస్తున్న ‘వందే భారత్’ను అధిగమించనుంది. వందే భారత్ రైలు సెమీ హైస్పీడు కేటగిరీలో నడుపుతుండగా, ‘నమో భారత్’ను హైస్పీడు కేటగిరీ కింద ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం మీరట్-ఢిల్లీ మధ్య 55 కిలోమీటర్ల మేర 160 కి.మీ. స్పీడుతో ‘నమో భారత్’ పరుగులు తీయనుందని చెబుతున్నారు.

వందే భారత్ కు ముందు దేశంలో వేగవంతమైన ట్రైనుగా ‘గతిమాన్ ఎక్స్ ప్రెస్’ను చెప్పేవారు. 2016లో ప్రారంభమైన ఈ ట్రైనును ‘వందే భారత్’ వెనక్కి నెట్టింది. 2022లో ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలుత 160 కి.మీ. స్పీడుతోనే నడిపేవారు. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ రైలుకు ఆదరణపై మిశ్రమ స్పందన వచ్చింది. అయితే 2024లో వందే భారత్ స్పీడ్ ను 130 కి.మీ. తగ్గించేశారు. దీంతో ధర ఎక్కువ.. వేగం తక్కువ అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే లిమిటెడ్ స్టాపులు, ఇతర సౌకర్యాల వల్ల వందేభారత్ విజయవంతంగానే నడుస్తోంది.

ధర ఎక్కువ అయినా, స్పీడు ఎక్కువగా ఉండాలని ప్రయాణికులు కోరుకుంటుండటం వల్ల కేంద్రం ‘నమో భారత్’ సూపర్ ఫాస్ట్ రైళ్లను తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. దీని వేగాన్ని 160 కి.మీ. నిర్ణయించారు. ఈ వేగంతో గతంలో గతిమాన్ ఎక్స్ ప్రెస్, వందే భారత్ రైళ్లు నడిచినా ఇప్పుడు వాటి వేగాన్ని 130 కి.మీ. తగ్గించడం వల్ల ‘నమో భారత్’ ప్రస్తుతానికి వేగంగా నడిచే రైలుగా గుర్తింపు సాధించింది. ఈ రైలు తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సౌత్ వరకు నడవనుంది. అదేవిధంగా ఢిల్లీలోని సరై కాలేఖాన్, యూపీలోని మోదీపురం మధ్య 82 కిలోమీటర్ల మధ్య మరో హైస్పీడు లైనులోనూ ఇంకో నమో భారత్ ప్రవేశపెట్టనున్నారు.

ఇక నమో భారత్ రైలులో రెండు వేల సీటింగ్ సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. మొత్తం ఏసీ కోచులు, 12 బోగీలతో ఈ రైలు నడవనుందని అంటున్నారు. ఢిల్లీ - మీరట్ మధ్య ఆదరణ చూసుకుని దేశంలోని ఇతర చోట్ల ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ తరహాలో ఈ రైళ్లు నడపాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు 400 నుంచి 800 కి.మీ దూరం వెళుతున్నాయి. కానీ నమో భారత్ రైళ్లు 50 నుంచి 200 కి.మీ మధ్యే నడపాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.