Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని ఢీకొడ‌తా: న‌మిత‌

తాజాగా ప్రముఖ తమిళ క‌థానాయిక నమిత 2026 తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ద‌ళ‌పతి విజయ్‌పై పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   13 April 2024 5:39 AM GMT
ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్‌ని ఢీకొడ‌తా: న‌మిత‌
X

ఎన్న‌డూ లేనిది ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌ముఖ సినీస్టార్లు రంగంలోకి దిగుతుండ‌డంతో రాజ‌కీయాల్లో గ్లామ‌ర్ డోస్ మ‌రింత పెరిగింద‌ని చెప్పాలి. ఈసారి త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో మాస్ హీరో, ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా శంఖారావం పూరిస్తున్నాడు. అయితే అత‌డితో ధీటుగా పోటీప‌డేది ఎవ‌రు? అన్న‌ది సందిగ్ధంగా మారింది.

తాజాగా ప్రముఖ తమిళ క‌థానాయిక నమిత 2026 తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ద‌ళ‌పతి విజయ్‌పై పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎగ్జిక్యూటివ్ కమిటీలో క్రియాశీల సభ్యురాలిగా ఉన్న నమిత, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. నీలగిరి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎల్.మురుగన్‌కు మద్దతు ఇవ్వడంపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాజా ప్ర‌చారంలో త‌న‌కు త‌మిళ‌నాడులో గుడులు క‌ట్టించుకున్న న‌మిత‌.. విజ‌య్ ని ఢీకొట్టే స‌త్తా ఉంద‌ని ఆత్మ‌విశ్వాసాన్ని వ్య‌క్తం చేసింది.

నమిత- విజయ్ మధ్య పొలిటికల్ వార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చ‌ర్చ‌గా మార‌నుంది. విజయ్ ఇటీవలే 'తమిళగ వెట్రిక్ కళగం' అనే రాజకీయ పార్టీని ప్రారంభించాడు. 2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించాడు. ఇప్పుడు అత‌డితో న‌మిత పోటీకి దిగుతూ రాజకీయాల్లో తెలివిగల ప్రత్యర్థిపై పోటీ చేయాల‌ని తాను భావిస్తానని పేర్కొంది. విజయ్‌ను బలీయమైన పోటీదారుగా చూడాలని అంది. ఈ వ్యాఖ్య ఇద్దరు గ్లామ‌ర‌స్ స్టార్ల‌ మధ్య ఘర్షణ‌కు దారితీస్తుందనే అంచనాలకు మరింత ఆజ్యం పోసింది.

అయితే నమిత పంచ్ లైన్లు విన్న విజ‌య్ అభిమానులు లైట్ తీస్కుంటున్నారు. ఈ భామ‌ విజయావకాశాలపై కొందరు అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళనాడులో న‌మిత‌కు బలమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంద‌న్న‌ది కాద‌న‌లేనిది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో న‌మిత చురుకుగా పాల్గొనడం కూడా ప్ర‌జ‌లంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదంతా ఓట్లుగా మారితే క‌లిసొస్తుందేమో!!