Begin typing your search above and press return to search.

రేవంత్ ని కలిసిన మాజీ డీఎస్పీ నళిని... తెరపైకి బ్యురోక్రసి - ఆధ్యాత్మికం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం స్పందించిన ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 11:10 AM GMT
రేవంత్  ని కలిసిన మాజీ డీఎస్పీ నళిని... తెరపైకి బ్యురోక్రసి - ఆధ్యాత్మికం!
X

తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉవ్వెత్తున లేచిన మలివిడత తెలంగాణ ఉధ్యమంలో ఎందరో త్యాగధనులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. మరికొంతమంది జీవితాలను త్యాగం చేశారు. ఈ సమయంలో తెలంగాణ సాధన కోసం డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళిని తాజాగా రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకంగా డీఎస్పీ ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళిని శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. అప్పటికే తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వడం, అలా ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని రేవంత్ అధికారులకు సూచించారు. ఈ సమయంలో ఆమె తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం స్పందించిన ఆమె పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే... ఇప్పుడు తనకు ఎటువంటి ఉద్యోగం అవసరం లేదని, డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయట పడి.. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడగగా.. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని నళిని తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నట్లు తెలిపిన ఆమె... సనాతన ధర్మ ప్రచారానికి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక... గతంలో తాను, తోటి ఉద్యోగులు.. డిపార్ట్మెంట్‌ లో ఎదుర్కొన్న సమస్యలపై ముఖ్యమంత్రికి నివేధిక ఇచ్చినట్లు నళిని తెలిపారు.

గతంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవరూ ఎదురుకోకూడదని.. తనలా మరెవరూ బాధపడవద్దనే ఉద్దేశ్యంతోనే ఆ నివేదికను సీఎంకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాడు తనకు బ్యురొక్రసి మీద నమ్మకం పోయిందని చెప్పిన మాజీ డీఎస్పీ... అందువల్లే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నళిని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.