వెంటాడిన అరుదైన వ్యాధి.. అమెరికాలో తెలంగాణ విద్యార్థిని దుర్మరణం
అందిన సమాచారం ప్రకారం.. ప్రియాంక అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనే అరుదైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
By: Tupaki Desk | 14 May 2025 5:35 PM ISTనల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ యువతి అరుదైన వ్యాధితో పోరాడుతూ దుర్మరణం పాలైంది. నల్గొండ జిల్లాలోని కట్టంగూరు మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన కొండి ప్రియాంక (26) యునైటెడ్ స్టేట్స్ లో మృతి చెందినట్లు సమాచారం.
గ్రామానికి చెందిన కొండి వెంకట్ రెడ్డి, శోభారాణి దంపతుల కుమార్తె అయిన ప్రియాంక అమెరికాలోని అలబామా యూనివర్సిటీ (యూఏహెచ్)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల దంత సమస్యతో వైద్యులను సంప్రదించగా, ఆమె రక్తంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల తర్వాత ప్రియాంక తన బాత్‌రూమ్‌లో అకస్మాత్తుగా పడిపోయి స్పృహ కోల్పోయింది.
ఆందోళన చెందిన ఆమె స్నేహితులు వెంటనే ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మరణించినట్లు నిర్ధారించారు. అందిన సమాచారం ప్రకారం.. ప్రియాంక అక్యూట్ మైలోయిడ్ లుకేమియా (AML) అనే అరుదైన రక్త క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలుస్తోంది.
ప్రియాంక మరణ వార్త తెలియగానే ఆమె స్వగ్రామం పందెనపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమార్తె ఇక లేదనే నిజాన్ని ప్రియాంక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అకాల మరణం చెందిన తమ బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల రోదనలు గ్రామంలోని ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.
ప్రియాంక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి.. ఆమె విద్యా రుణం తీర్చడానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆర్థిక సహాయం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత ఆశయాలతో అమెరికా వెళ్లిన ప్రియాంక అకస్మిక మరణం పట్ల గ్రామస్తులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
