పుట్టింటికి మరాఠా ఆడబిడ్డ.. బీజేపీ కోసం భర్తనే వదిలేసింది!
ఎన్నికలు ఒకే కుటుంబంలో విభేదాలు రేపడం మనందరం చూసిందే..! ఇలా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఆఖరికి తండ్రీకొడుకులు కూడా విడిపోయిన ఉదంతాలను చదివాం.
By: Tupaki Desk | 3 Jan 2026 8:15 AM ISTఎన్నికలు ఒకే కుటుంబంలో విభేదాలు రేపడం మనందరం చూసిందే..! ఇలా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, ఆఖరికి తండ్రీకొడుకులు కూడా విడిపోయిన ఉదంతాలను చదివాం. తండ్రి ఒక పార్టీ కుమారుడు మరో పార్టీ.. అన్న ఒక పార్టీ.. తమ్ముడు మరో పార్టీ.. ఇది ఎన్నికల కారణంగా తలెత్తిన కుటుంబాల చీలిక. అయితే, కేవలం ఎన్నికల రాజకీయాల రీత్యా భర్తను వదిలేయడం అనేది మాత్రం మనకు అనుభవంలోకి రాలేదు. కానీ, మహారాష్ట్రలో అదే జరిగింది. ఈ రాష్ట్రంలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి కనీవినీ ఎరుగని రీతిలో విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని ప్రత్యర్థి కూటమి ఇండియాకు అందనంత స్థాయిలో సీట్లు స్వీప్ చేసింది. ఇక గత నెల నాలుగో వారంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లోనూ మహాయుతి సత్తా చాటింది. పాలక బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏకంగా 117 మున్సిపల్ అధ్యక్ష పదవులను గెలుచుకుంది. శివసేన 53, ఎన్సీపీ 37 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ 28, శరద్ పవార్ ఎన్సీపీ ఏడు, శివసేన (ఉద్ధవ్) తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకున్నాయి.
ఆ మేయర్ పార్టీకి సైనికురాలు..
భర్త పార్టీ మారడం తనకు నచ్చలేదంటూ సాధారణ మహిళా కార్యకర్తలు ఎవరైనా అలగడం, ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే. కానీ, మేయర్ స్థాయిలో పనిచేసిన మహిళ ఏకంగా భర్త తీరు నచ్చక పుట్టింటికి వెళ్లిపోవడమే ఇక్కడ విచిత్రం. కథలోకి వెళ్తే.. బీజేపీ అంటే నాగపూర్ మాజీ మేయర్ అర్చన దేహంకర్ కు వల్లమాలిన అభిమానం. నాగపూర్.. బీజేపీ సైద్ధాంతిక సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానం. అయితే, అర్చన భర్త వినాయక్ దేహంకర్ ఇటీవల బీజేపీపై తిరుగుబాటు చేశారు. ఇది నచ్చక ఆమె పుట్టింటికి వెళ్లిపోయారు.
ఆయన నిర్ణయంలోనూ న్యాయం..
అయితే, వినాయక్ దేహంకర్ నిర్ణయం ఏమిటి? అంటే.. ఆయన నాగపూర్ కార్పొరేషన్ 17వ డివిజన్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని భావించారు. కానీ, ఆ టికెట్ ను బీజేపీ.. కాంగ్రెస్ నుంచి వచ్చిన మనోజ్ సాబ్లేకు ఇచ్చింది. దీంతో వినాయక్ పార్టీని విడిచిపెట్టారు. చివరకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇది నచ్చని అర్చన భర్తకు బైబై చెప్పి పుట్టింటికి వెళ్లిపోయారు. భర్త కంటే పార్టీ విధేయతే తనకు ముఖ్యం అని చెప్పే ఈమె 2009-12 మధ్య బీజేపీ నుంచి నాగపూర్ మేయర్ గా పనిచేశారు. అందుకే పుట్టింటికి వచ్చేశానని అంటున్నారు. ఇక్కడినుంచే బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించడం గమనార్హం. నాగపూర్ కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 15న జరగనున్నాయి. 16న ఓట్లు లెక్కించనున్నారు. 2022లోనే కార్పొరేషన్ పాలకవర్గం గడువు ముగిసింది. అయితే, అప్పటినుంచి ప్రత్యేకాధికారి పాలనలో సాగుతోంది.
