Begin typing your search above and press return to search.

సాగ‌ర్‌లో.. 'లోక‌ల్' పాలిటిక్స్.. బీఆర్ఎస్ యువ నేత‌కు షాకిస్తున్న రాజ‌కీయం!

సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాజా ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు వార‌సులు హోరా హోరీ త‌ల‌ప‌డుతున్నారు. ఇద్ద‌రూ యువ నేత‌లే కావ‌డం.. రెండూ కూడా ప్ర‌ధాన పార్టీలు కావ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

By:  Tupaki Desk   |   5 Nov 2023 12:30 AM GMT
సాగ‌ర్‌లో.. లోక‌ల్ పాలిటిక్స్.. బీఆర్ఎస్ యువ నేత‌కు షాకిస్తున్న రాజ‌కీయం!
X

విష‌యం ఏదైనా.. ప్ర‌త్య‌ర్థిలో లోపం గ‌మ‌నిస్తే చాలు.. ప్ర‌చారాస్త్రంగా చేసుకునేందుకు నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కీల‌క‌మైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏ పార్టీ కూడా ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. దీంతో అభ్య‌ర్థులు కూడా చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక‌త అంశం ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీకి సెగ పుట్టోంది. సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాజా ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు వార‌సులు హోరా హోరీ త‌ల‌ప‌డుతున్నారు. ఇద్ద‌రూ యువ నేత‌లే కావ‌డం.. రెండూ కూడా ప్ర‌ధాన పార్టీలు కావ‌డంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ ఎస్ తర‌ఫున దివంగ‌త నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్ బ‌రిలో నిలిచారు. వాస్తవానికి 2018లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ త‌ర‌ఫున‌ నోముల న‌ర్సింహ‌య్య పోటీ చేశారు. అప్ప‌ట్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డిని ఆయ‌న ఓడించారు. అయితే, నోముల తీవ్ర అనారోగ్యంతో 2021లో మృతి చెందారు. దీంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ నోముల కుమారుడు భ‌గ‌త్‌ను రంగంలోకి దింపారు. ఉప పోరులో మ‌ళ్లీ జానా రెడ్డి పోటీ చేయ‌గా.. భ‌గ‌త్ చేతిలోనూ ఓట‌మి చ‌విచూశారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు బీఆర్ ఎస్ త‌ర‌ఫున సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్‌, కాంగ్రెస్ త‌ర‌ఫున జానా రెడ్డి కుమారుడ కుందూరు జైవీర్ రెడ్డి త‌ల‌ప‌డుతున్నారు. ఇద్ద‌రూ కూడా సీనియ‌ర్ నేత‌ల కుమారులు కావ‌డం.. ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన నాయ‌కులు కావ‌డంతోపాటు.. యువ‌త కావ‌డంతో ఇక్క‌డ పోరు వీరిద్ద‌రి మ‌ధ్య స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో జైవీర్ రెడ్డి కీల‌క అంశాన్ని తెర‌మీదికి తెచ్చారు. నోముల భ‌గ‌త్ స్థానికేత‌రుడ‌ని.. ఆయ‌న‌కు ఇక్క‌డి స‌మ‌స్య‌లు ఏం తెలుసున‌ని.. తాము ఇక్క‌డే పుట్టి ఇక్క‌డే పెరుగుతున్నామ‌ని.. త‌న తండ్రి ఇక్క‌డి ప్ర‌జ‌లకు ఎంతో మేలు చేశార‌ని జైవీర్ రెడ్డి ప్ర‌చారంలో హోరెత్తిస్తున్నారు.

అంతేకాదు.. జ‌న‌ చైత‌న్య యాత్ర‌ల పేరుతో గ్రామాల్లో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఇదేస‌మ‌యంలో బీఆర్ ఎస్ అసంతృప్త నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొంటున్నారు. వీటికితోడు.. నోముల భ‌గ‌త్‌పై నాన్‌లోక‌ల్ ముద్ర వేస్తున్నారు. దీనిని విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. నోముల భ‌గ‌త్ న‌కిరిక‌ల్లు మండ‌లానికి చెందిన‌వారు కావడం.. ఈ ప్రాంతం సాగ‌ర్ ప‌రిధిలో లేక‌పోవ‌డంతో భ‌గ‌త్ ఇర‌కాటంలో ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ.. ఉప ఎన్నిక‌లో త‌న‌ను గెలిపించిన ప్ర‌జ‌లు.. ఇప్పుడు కూడా త‌న‌ను గెలిపిస్తార‌ని ఆయ‌న భ‌రోసా వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, చాప‌కింద నీరులా.. నాన్‌లోక‌ల్ అంశం మాత్రం భ‌గ‌త్‌కు సెగ పుట్టిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.