200 కోట్ల స్థలం ప్రభుత్వానికి ఇచ్చేసిన హీరో నాగార్జున..రేవంత్ సంచలనం
తాజాగా పీజేఆర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన రేవంత్.. కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
By: Tupaki Desk | 28 Jun 2025 5:59 PMతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తరచూ చర్చనీయాంశమైంది ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం. హైదరాబాద్ మహా నగరంలో ప్రకృతి వనరుల పరిరక్షణ, ఆక్రమణల అడ్డుకట్టకు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా ఓ తెల్లవారుజామున నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. హీరో నాగార్జున వంటి వ్యక్తికి చెందిన నిర్మాణాన్ని ఉన్నపళంగా పడగొట్టడం తెలుగు చిత్ర పరిశ్రమకూ ఓ ఝలక్‌గా కనిపించింది. ఈ వివాదం కొన్ని రోజుల పాటు నలిగింది. అయితే, నాగ్ దీనిపై ఎంతో హుందాగా స్పందించారు. వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపెట్టారు. ఇక రగడ సద్దుమణిగింది అనుకుంటుండగా అనుకోకుండా వారి ప్రమేయం లేకుండా వ్యక్తిగత వివాదం చుట్టుముట్టింది. ఇది తీవ్రస్థాయి విమర్శలకు కూడా తావిచ్చింది. ఆపై చల్లారింది. ఇటీవల నాగార్జున తన రెండో కుమారుడు అక్కినేని అఖిల్ వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని స్వయంగా ఆహ్వానించారు. దీనిని ఆయన కూడా మన్నించి కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది.
హైదరాబాద్‌లో తాజాగా జరిగిన పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ నాగార్జునను రియల్ హీరోగా అభివర్నించారు. ఆయనకు చెందిన ఎన్ కన్వెక‌్షన్ కూల్చివేతను ప్రస్తావించారు. ఆ ఘటన జరిగాక అక్కడి 2 ఎకరాలను నాగార్జున తిరిగి ఇచ్చేశారని రేవంత్ సంచలన విషయం బయటపెట్టారు. ఇప్పటివరకు ఇది తెలియని విషయం కావడం గమనార్హం. వాస్తవానికి మాదాపూర్ ఏరియాలోని ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు చాలా ఖరీదైనది. నిరుడు ఆగస్టులో దానిని కూల్చివేసినప్పుడు నాగార్జున స‍్పందిస్తూ.. అంగుళం భూమి కూడా ఆక్రమించుకోలేదని ప్రకటించారు. అయితే, అక్కడి తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
ఏకంగా మూడున్నర ఎకరాలు ఆక్రమించి నిర్మించారని ఫిర్యాదులు వచ్చాయి. అందుకనే హైడ్రా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా స్పందిస్తూ.. తుమ్మిడికుంట ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు కాగా.. 2014లో 2.39 ఎకరాల్లో 19 అక్రమ కట్టడాలు నిర్మించారని తెలిపింది. ఎఫ్‌టీఎల్‌లో 2020లో 4.69 ఎకరాల్లో 32 అక్రమ కట్టడాలు కట్టారని పేర్కొంది. ఈ చెరువు బఫర్ జోన్ విస్తీర్ణం 10 ఎకరాలు అని స్పష్టం చేసింది.
తాజాగా పీజేఆర్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన రేవంత్.. కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో నివసించలేని పరిస్థితి నెలకొందని అన్నారు. పెద్ద వర్షం వస్తే తమిళనాడు రాజధాని చెన్నై అతాలాకుతలం అవుతోందని చెప్పారు. కర్నాటక రాజధాని బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుంటోందని.. వీటిలా కాకుండా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. నగరంలో నాలాలు కబ్జాలకు గురవడం వల్లే ముంపు తీవ్రత పెరిగిందన్నారు. హైడ్రా ద్వారా నాలాలు, చెరువులు కబ్జాలకు గురవకుండా కాపాడుతున్నట్లు పేర్కొన్నారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చాక ఆయనే స్వయంగా తుమ్మడికుంట చెరువును ఆనుకుని ఉన్న 2 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించి నిజమైన హీరోలా నిలిచారని రేవంత్ కొనియాడారు. తమ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారని కూడా తెలిపారు.
కాగా, నాగార్జున 2 ఎకరాలు తిరిగిచ్చిన విషయం ఇప్పుడు రేవంత్ చెప్పడంతోనే బయటకు వచ్చింది. మాదాపూర్‌లో ఎకరం వంద కోట్లు అయినా ఉంటుంది.. అంటే, కనీసం రూ.200 కోట్ల స్థలాన్ని నాగార్జున ప్రభుత్వానికి తిరిగిచ్చేసినట్లే అనుకోవాలి.