Begin typing your search above and press return to search.

లోకేష్ మాటలని లైట్ తీస్కోమంటున్న నాగబాబు...!

టీడీపీ యువ నేత నారా లోకేష్. టీడీపీలో లోకేష్ కి చంద్రబాబు తరువాత ప్లేస్ ఉంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 10:08 AM GMT
లోకేష్ మాటలని లైట్ తీస్కోమంటున్న నాగబాబు...!
X

టీడీపీ యువ నేత నారా లోకేష్. టీడీపీలో లోకేష్ కి చంద్రబాబు తరువాత ప్లేస్ ఉంది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీలో లోకేష్ ప్రభావం కూడా చాలా ఉంది అని అంటున్నా నేపధ్యం. ఇదిలా ఉంటే లోకేష్ ని ఆయన మాటలను లైట్ తీస్కోమంటున్నారు జనసేన నేత నాగబాబు.

ఈ మేరకు ఆయన కాపు నేతల సమావేశంలో చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. ఇంతకీ నాగబాబు ఏ సందర్భంలో ఎందుకు ఇలా అన్నారంటే నాగబాబు జనసేన వైపుగా కాపు సామాజికవర్గాన్ని పూర్తి స్థాయిలో మళ్ళించేందుకు తన వంతుగా ఏపీవ్యాప్తంగా టూర్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఆయన విశాఖలో కాపు నేతలు, కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు వ్యాపారవేత్తలలో సీక్రెట్ మీటింగ్ ఒకటి పెట్టారు అన్నది కాస్తా లేట్ గా వెలుగులోకి వచ్చింది. ఈ మీటింగులో నాగబాబుని కాపు నేతలు పలువురు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అన్న ప్రశ్నను ముందుంచారని అంటున్నారు.

దానితో పాటుగా ఇటీవల నారా లోకేష్ యూ ట్యూబ్ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో సైతం చంద్రబాబే సీఎం రెండవ ఆలోచనే లేదు అని కూడా చెప్పి మరీ కుండబద్ధలు కొట్టిన సంగతిని కూడా గుర్తు చేశారు దానికి నాగబాబు అయితే తనదైన శైలిలో సమాధానం ఇచ్చారని అంటున్నారు.

చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలసి కూర్చుని సీఎం అభ్యర్ధి మీద నిర్ణయం తీసుకుంటారు అని నాగబాబు చెప్పారని అంటున్నారు. ఈ విషయంలో నారా లోకేష్ అన్న మాటలను ఎవరూ పట్టించుకోవాల్సిన పని లేదని నాగబాబు చెప్పారని అంటున్నారు.

సీఎం ఎవరన్నది చంద్ర బాబు, పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారు. ఈ అంశంపై ఇతర వ్యక్తుల అభిప్రాయానికి మనం విలువ ఇవ్వకూడదు. సీఎం అభ్యర్థిపై లోకేష్ వ్యాఖ్యను పట్టించుకోకుండా అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయడంపైనే మీరంతా దృష్టి పెట్టాలని నాగబాబు వారితో అన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

అది సరే కానీ చంద్రబాబు సీఎం అనే కదా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా కొత్తగా చెప్పేది ఏముంది అన్న మాట కూడా వస్తోంది. గత నెలలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో చంద్రబాబు పర్యటించినపుడు కూడా తాను సీఎం గా వస్తున్నాను అని అన్నీ చూసుకుంటాను అని చెప్పారు. ఇక బాబు మూడేళ్ల క్రితం అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తూ కూడా సీఎం గానే మళ్ళీ అడుగుపెడతాను అని కూడా శపధం చేసి వచ్చారు అన్నది కూడా గుర్తు చేస్తున్న వారు ఉన్నారు.

ఇక చంద్రబాబు సీఎం అవడం చారిత్రక అవసరం అని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు సీఎం అయిన తరువాత ఇక అధికారంలో వాటా సీఎం పదవి షేర్ అన్నది ఉంటుందా అన్నది కూడా చూడాలి. సాధారణంగా సీఎం సీటు షేర్ అన్నది మ్యాజిక్ ఫిగర్ కి సీట్లు తక్కువ పడినపుడు పొత్తు పార్టీలకు చాన్స్ ఇస్తారు.

అలా కనుక చూసుకుంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు. ఎన్ని సీట్లలో గెలుస్తుంది అన్నది తెలిస్తేనే తప్ప ఈ విషయం లో పూర్తి క్లారిటీ రాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు జనసేనకు ఏ ముప్పయి సీట్లో ఇచ్చారని అనుకుంటే అందులో ఏ ఇరవై సీట్లో గెలిస్తే రేపటి కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రభావం ఏమి ఉంటుంది అన్న చర్చ కూడా వస్తోంది.

అలాగే టీడీపీ 150 కి తగ్గకుండా సీట్లకు పోటీ చేసి మ్యాజిక్ ఫిగర్ అయిన 88 మార్క్ ను సులువుగా చేరుకుంటే అపుడు సీఎం సీటు షేర్ కి అవకాశం ఎక్కడిది అన్న చర్చ కూడా వస్తోంది. ఈనాటి రాజకీయాలు అన్నీ సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్మార్ట్ యుగంలో ఫోన్ ఉన్న ప్రతీ వారూ రాజకీయ విశ్లేషకులే. ఇక్కడ గుప్పిట మూయడం అన్న ప్రసక్తే లేదు.

అందువల్ల ఎన్నికల తరువాత సీఎం అభ్యర్ధి అని చెప్పెదాని కంటే కూడా ముందే పవన్ ఇన్నేళ్ళ పాటు చంద్రబాబు ఇన్నేళ్ల పాటు సీఎం పదవికి షేర్ చేసుకుంటారు. ఈ మేరకు జనసేనకు ఇన్ని సీట్లు ఇస్తున్నామని బాహాటంగా చెబితేనే పొత్తు అన్నది వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు.

అయితే నారా లోకేష్ కామెంట్స్ వ్యక్తిగతం అని అనుకోవడానికి వీలుందా అన్నది కూడా మరో ప్రశ్న. ఆయన ఏమీ బయట నాయకుడు కాదు చంద్రబాబు కుమారుడు టీడీపీ రాజకీయ వారసుడు. అందువల్ల లోకేష్ మాటలు అంటే ఇండైరెక్ట్ గా బాబు మాటలే అన్న వారూ ఉన్నారు. ఏది ఏమైనా జనసేన నేతల నమ్మకాలే నిజం అవుతాయని ఎవరైనా అనుకుంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.