అప్పుడు అనుకున్నదే నిజమైంది.. పవన్ పై నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైందని, ఆడబిడ్డలు, అక్కచెల్లెమ్మల రక్షణకు తోడైందని, ఐదున్నర కోట్ల ఆంధ్రుల కల నిజమైందని ఆనందం వ్యక్తం చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు.
By: Tupaki Desk | 12 May 2025 7:38 PM ISTజనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. గత ఏడాది కరెక్టుగా ఇదే సమయంలో తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేసిన మెగా బ్రదర్, తన తమ్ముడు జనసేనాని పవన్ కల్యాణ్ కు నాటి విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఏడాది కిందట జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ తీసుకున్న చొరవతో నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
జనసేనానిగా తిరుగులేని విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్ ఎన్నికల అనంతరం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. డీసీఎం హోదాలో ప్రభుత్వం, పాలనలో స్పష్టమైన ముద్ర వేస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో చాలా హామీలే ఇచ్చారు. వాటిని ప్రజలు గుర్తు చేసుకుంటుండగా, నాగబాబు కూడా తమ హామీలను గుర్తు చేసే ప్రయత్నం చేసి ఆకట్టుకున్నారు.
ఏడాది క్రితం ఎన్నికల ప్రచారంలో తనకు, తన సోదరుడికి మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ నాగబాబు ట్వీట్ చేశారు. సరిగ్గా ఏడాది క్రితం మనద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైందంటూ నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మీరు చిందించిన చెమట కూటమి గెలుపునకు బాట అయిందన్నారు. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైందని, ఆడబిడ్డలు, అక్కచెల్లెమ్మల రక్షణకు తోడైందని, ఐదున్నర కోట్ల ఆంధ్రుల కల నిజమైందని ఆనందం వ్యక్తం చేస్తూ నాగబాబు ట్వీట్ చేశారు.
సేనాని..
సరిగ్గా ఏడాది క్రితం మనిద్దరి మధ్య జరిగిన సంభాషణ నిజమైంది, మీరు చిందించిన చెమట కూటమి గెలుపునకు బాటైంది. జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ప్రజలకు చేరువైంది. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు మార్గం సుగమమైంది. ఆడబిడ్డలు, అక్క చెల్లెమ్మలకు రక్షణ తోడైంది.’’ అంటూ పవన్ తో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ కు జతచేశారు.
ఏడాది క్రితం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రజలకు హామీ ఇచ్చిన పవన్.. టీడీపీ, బీజేపీతో కలిపి కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా పొత్తుల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శిస్తూ తన పరిణతి చాటుకున్నారు. తొలుత 24 సీట్లు తీసుకున్న పవన్, ఆ తర్వాత కూటమిలో బీజేపీ చేరిన తర్వాత మూడు సీట్లు తగ్గించుకుని 21 సీట్లతో సరిపెట్టుకున్నారు. ఈ విషయంలో ఆయనను రెచ్చగొట్టేలా చాలా ప్రయత్నాలు జరిగినా, పట్టించుకోలేదు. దీంతో ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేటుతో విజయం సాధించి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 11 నెలలకు నాటి విషయాలను గుర్తు చేస్తూ నాగబాబు ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
