నాగబాబుకు మంత్రి పదవి...క్లారిటీ వచ్చేసినట్లేనా !
మెగా బ్రదర్, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ. ఈ హోదా బాగానే ఉంది. హాయిగా పెద్దల సభలో ఆరేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించవచ్చు. ప్రజా సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవచ్చు.
By: Tupaki Desk | 30 May 2025 6:00 PM ISTమెగా బ్రదర్, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్సీ. ఈ హోదా బాగానే ఉంది. హాయిగా పెద్దల సభలో ఆరేళ్ల పాటు ప్రాతినిధ్యం వహించవచ్చు. ప్రజా సమస్యలను పెద్దల సభలో ప్రస్తావించడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవచ్చు. ఆరున్నర పదుల వయసులో ఉన్న నాగబాబుకు స్థాయికి తగిన పదవి ఇది. అయితే దీనితోనే ఆయనకు సరిపెడతారా. ఆయన స్తోమతకు ఇంతకు మించి సేవ చేసే చాన్స్ ఇస్తారా లేదా అన్నదే చర్చగా ఉంది.
నిజానికి చూస్తే మెగా బ్రదర్ ని మంత్రి అని ఆరేడు నెలల క్రితమే అన్నారు. ఆ మాటలు ఏ ఊహాగానాలో ఎవరో చెప్పినవి అయితే కావు. ఏ గాసిప్స్ సైతం కానే కావు. ఏపీ ముఖ్యమంత్రి కూటమి పెద్దగా ఉన్న చంద్రబాబు ట్విట్టర్ ద్వారానే చాలా నెలల క్రితం ప్రకటించారు. నాగబాబుని తన కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లుగా ఆయన స్పష్టంగానే వెల్లడించారు.
అయితే బాబు ప్రకటించిన నాటికి నాగబాబు ఏ చట్ట సభలో సభ్యుడు అయితే కారు, ఆయన కేవలం జనసేన నాయకుడు మాత్రమే. ఆ లోటుని తీరుస్తూ మార్చి నెలతో ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు. ఆ మీదట మంచి రోజు చూసుకుని ప్రమాణం కూడా ఎమ్మెల్సీగా చేశారు. ఇక ఆయన ఎమ్మెల్సీ రెండు నెలలు పూర్తి అయింది కానీ మంత్రి పదవి అయితే కనుచూపు మేరలో కానరావడం లేదు అని అంటున్నారు.
నిజానికి అప్పట్లో జరిగిన ప్రచారం బట్టి చూస్తే కనుక మార్చి 30న ఉగాది పండుగ వేళ నాగబాబు మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. మధ్యలో ఏప్రిల్ 30, మే 30 కూడా పూర్తి అయి క్యాలెండర్ లో కాగితాలు చిరుగుతున్నాయి కానీ నాగబాబు మినిస్టర్ కాలేకపోతున్నారు. ఇక చూస్తే జూన్ నెల 12తో కూటమి ప్రభుత్వం తొలి ఏడాది పాలన పూర్తి చేసుకోబోతోంది.
దాంతో పాటు అనేక కార్యక్రమాలను కూడా ప్రకటించనున్నారు. ఇక ఆ తరువాత జూన్ 22 నుంచి ఆషాడ మాసం వచ్చేస్తోంది. అంటే అది పూర్తిగా శూన్యమాసం అన్న మాట. మళ్ళీ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉంటే కానీ ఏ ముఖ్య కార్యక్రమం చేపట్టేందుకు వీలు పడదని అంటున్నారు. అయినా మంత్రి వర్గ విస్తరణ అన్న అజెండా ఉంటే ముహూర్తాలు కానీ లేకపోతే ఈ తాపత్రయాలు ఎందుకు అన్నది కూడా చర్చిస్తున్నారు.
బొత్తిగా ఏడాదికే ఉన్న మంత్రులను తప్పించి కొత్తవారికి ఇవ్వాలన్న ఆలోచన అయితే కూటమి పెద్దలకు లేదు అని అంటున్నారు. కేవలం నాగబాబు కోసం రీషఫలింగ్ చేసినా చాలా మంది ఆశావహులు ముందుకు వస్తారని అలా చూస్తే కోరి తేనే తుట్టెను కదిపినట్లు అవుతుందని అంటున్నారు. దాంతో అన్నీ చూసుకుని సమయం సందర్భం వచ్చినపుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులూ అని అంటున్నారు.
అంతవరకూ నో విస్తరణ నో మార్పులు అని కూడా అంటున్నారు సో నాగబాబుకు మంత్రి పదవి విషయంలో అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఇక జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. బీజేపీ మరోటి కావాలని అంటోంది. టీడీపీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. అలా అందరినీ ఆశలలో తేలించడానికే కేబినెట్ లో ఒకే ఒక్క బెర్త్ ని అలా ఖాళీగా ఉంచేసారు అని అంటున్నారు. సో ఆ ఖాళీ అలాగే మరిన్నాళ్ళు కొనసాగుతూనే ఉంటుంది అన్నది తాజా కబురుగా ఉంది మరి.
