నాగబాబు మంత్రి పదవి ఆయన చేతులలో ?
ఇపుడు పవన్ కూడా ఆలోచించాలని నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అంటే ఆయన మదిలో వేరే ఆలోచనలు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది.
By: Tupaki Desk | 22 July 2025 11:13 PM ISTనాగబాబు మంత్రి అవుతారా లేక రాజ్యసభ సభ్యుడవుతారా అలా కేంద్ర మంత్రిగా పదోన్నతి పొందుతారా ఇవన్నీ మెగా బ్రదర్ పొలిటికల్ ఫ్యూచర్ మీద జరుగుతున్న చర్చలే. ఇవన్నీ నాగబాబు రాజకీయం మీద అంతా చేస్తున్న ప్రచారమే. మరి దీనికి కామాలే కానీ ఫుల్ స్టాప్ లేదు. మరి ఎవరు ఫుల్ స్టాప్ పెడతారు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆ సస్పెన్స్ ని ఇంకా కొనసాగించారు.
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ నాగబాబుకు మంత్రి పదవి అన్నది ఆలోచించలేదని అన్నారు. ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అంటే నాగబాబు మంత్రి పదవి చేపట్టాలా వద్దా అన్నది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేస్తారని అంటున్నారు. సరిగ్గా తొమ్మిది నెలల క్రితం చంద్రబాబు సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ అయితే చేశారు.
నాగబాబుని కేబినెట్ లోకి తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఆనాడు రాజ్యసభ సభ్యుల ఎంపిక సమీకరణల నేపధ్యంలో బాబు ఈ విధంగా ప్రకటించారు. అయితే దాని మీద జనసేన నుంచి అయితే అధికారికంగా వెల్ కం చేయడం కానీ లేదా మరోటి కానీ రాలేదు కానీ నాగబాబు అప్పటికి ఎమ్మెల్సీ కూడా కాదు. ఇపుడు ఎమ్మెల్సీ అయి నాలుగైదు నెలలు గడుస్తున్నాయి. చట్ట సభలలో సభ్యుడిగా ఉంటూ మంత్రి పదవి తీసుకునేందుకు అన్ని విధాలుగా అర్హత సాధించినా నాగబాబు విషయంలో సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది.
ఇపుడు పవన్ కూడా ఆలోచించాలని నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. అంటే ఆయన మదిలో వేరే ఆలోచనలు ఉన్నాయా అన్నదే చర్చగా ఉంది. ఇక జనసేనకు కేంద్రంలో ఒక మంత్రి పదవి కన్ ఫర్మ్ అని చెబుతున్నారు. ఆ మంత్రి పదవి నాగబాబుకు ఇప్పించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు అదే సమయంలో ఏపీలో ఒక మంత్రి పదవిని కోరి దానిని బీసీ నేతకు ఇప్పించుకోవడం ద్వారా సామాజిక సమతూకాన్ని పాటించాలన్నది జనసేన ఆలోచనగా చెబుతున్నారు.
అందుకే నాగబాబు విషయంలో పవన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారని చెబుతున్నారు. అయితే నాగబాబు 2026లో రాజ్యసభ సభ్యుడు అవుతారు. అంతవరకూ ఎమ్మెల్సీగా కొనసాగుతారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే తన సోదరుడి విషయంలో పవన్ కళ్యాణ్ సరిగ్గానే ఆలోచిస్తున్నారని అలాగే జనసేన భవిష్యత్తు దృష్ట్యా సరైన నిర్ణయాలే తీసుకుంటారని అంటున్నారు.
నాగబాబు కేంద్రంలో ఉంటే జనసేన పొలిటికల్ ఎలివేషన్ వేరేగా ఉంటుంది. మోడీతో మంచి రిలేషన్స్ జనసేనకు ఉన్నాయి. అవి మరింతగా పెరుగుతాయని అంటున్నారు. అదే విధంగా జాతీయ రాజకీయాల్లో జనసేన పాత్ర కూడా రానున్న కాలంలో కీలకంగా మారుతుందని అందువల్ల తన సోదరుడిని ఢిల్లీలో ఉంచాలని పవన్ ఆలోచిస్తున్నారు అని చెబుతున్నారు.
