నాగబాబుకు పదవి...మనసంతా ప్రేమతో మెగాస్టార్ !
చిరంజీవిని అండగా తమ్ముడిగా నాగబాబు ప్రతీ సందర్భంలోనూ నిలబడ్డారు. ఇక ఆయన అన్న గీసిన గీటు దాటని లక్ష్మణుడిగా పేరొందారు.
By: Tupaki Desk | 2 April 2025 10:19 PM ISTతన పెద్ద్ద తమ్ముడు నాగబాబు మీద మెగాస్టార్ కి కొండంత ప్రేమ. సినీ రంగంలోకి వారసుడిగా మొదట నాగబాబునే ఆయన తీసుకుని వచ్చారు. తన చిత్రాలలో అనేక పాత్రలు ఆయన చేత వేయించారు. ఇక నాగబాబుని ప్రొడ్యూసర్ గా చేసి తన నూరవ చిత్రం రుద్రవీణ ఆయన బేనర్ లో చేసి జాతీయ అవార్డుని నిర్మాతగా తొలి సినిమాకే అందుకున్న ఖ్యాతిని కూడా కలిగించారు.
నిరంతరం తమ్ముడు యోగ క్షేమాలను చూస్తూ తాను అన్నగా తండ్రిగా చిరంజీవి ఎంతో బాధ్యతగా ఉంటారు. తన అన్న అంటే తనకు చనువుతో పాటు భయం కూడా ఉందని నాగబాబు అనేకసార్లు చెప్పుకున్నారు. ఇక తనకు వరసకు అన్న కానీ తండ్రి సమానుడు అని కూడా నాగబాబు చాలా ప్రేమతో చెప్పిన మాటలూ ఉన్నాయి.
చిరంజీవిని అండగా తమ్ముడిగా నాగబాబు ప్రతీ సందర్భంలోనూ నిలబడ్డారు. ఇక ఆయన అన్న గీసిన గీటు దాటని లక్ష్మణుడిగా పేరొందారు. నాగబాబు ఏ విజయం సాధించినా తాను ఆనందించే గుణం ఉన్న మెగాస్టార్ కి తమ్ముడు పెద్దల సభలో ఎమ్మెల్సీ కావడం కంటే ఆనందం ఏమి ఉంటుంది.
అందుకే ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు ఆశీస్సులతో అన్నయ్య, వదిన అని ఇన్స్ టాగ్రాం లో పోస్టు చేసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నారు మెగాస్టార్. వదినమ్మ సురేఖ అన్న మెగాస్టార్ తో కలసి పూలదండలతో ఉన్న నాగబాబు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక నాగబాబు ఎమ్మెల్సీ కావడంతో చట్ట సభలలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అన్న దమ్ములూ వెళ్ళినట్లు అయింది. చిరంజీవి అయితే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగానూ కనిపించారు. పవన్ ఎమ్మెల్యేగా ఉంటే అదే సమయంలో నాగబాబు ఎమ్మెల్సీగా ఉండడం విశేషం.
ఇక రానున్న రోజులలో మరింతగా నాగబాబుకు రాజయోగం పడుతుందని అంటున్నారు. ఆయన కూడా చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అవుతారు అని అంటున్నారు. దీంతో అపుడు మెగాస్టార్ అనందం ఇంతకు వేయింతలుగా మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా అన్నకు తగ్గిన తమ్ముడిగా తమ్ముడికి తగిన అన్నయ్యగా మెగా మధ్యముడిగా నాగబాబు తన జీవితంలో అద్భుతమైన స్థానాన్ని అందుకున్నారు.
అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలో మెగా ఫ్యామిలీ నిరూపిస్తే అందరిలో తానుగా తనలో అందరినీ నింపుకుని వారి ప్రేమానురాగాలను ఎంతగానో అందుకుని ముందుకు సాగే నాగబాబులా పుడితే పుట్టాలి అన్నట్లుగా ఆయన తన జీవితాన్ని స్పూర్తివంతం చేసుకున్నారు అంటే అందులో అతిశయోక్తి అయితే లేదు సుమా. దటీజ్ నాగబాబు.
