Begin typing your search above and press return to search.

నాగబాబుకు అదే అడ్డంకి...నిజమేనా ?

జనసేనలో పవన్ కళ్యాణ్ అధినాయకుడు. ఆయన నిర్ణయాలే అమలు అవుతాయి.

By:  Tupaki Desk   |   3 Jun 2025 8:15 AM IST
నాగబాబుకు అదే అడ్డంకి...నిజమేనా ?
X

జనసేనలో పవన్ కళ్యాణ్ అధినాయకుడు. ఆయన నిర్ణయాలే అమలు అవుతాయి. ఇక పవన్ కి అన్నయ్య మాత్రమే కాదు జనసేనలో కీలక నాయకుడుగా నాగబాబు ఉన్నారు. ఆయన పార్టీ కోసం చాలానే పనిచేశారు. గ్రౌండ్ లెవెల్ లో ఆయన పార్టీకి బలం చేకూర్చారు.

ఆయన పార్టీ కోసం త్యాగాలూ చేశారు. అనకాపల్లి నుంచి పోటీ చేసి ఎంపీ కావాలనుకున్న ఆయన చివరి నిముషంలో తప్పుకోవడం కంటే పెద్ద త్యాగం ఏమి ఉంటుంది అని గుర్తు చేసేవారు అనేకమంది ఉన్నారు. ఇక నాగబాబు వివిధ వర్గాలను కలుస్తూ జనసేనకు వారిని దగ్గర చేసే కార్యక్రమం చేపడుతూ పార్టీకి ఒక పిల్లర్ గా ఉన్నారు. అటువంటి నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్నది కూటమి పెద్దల ప్రతిపాదన. స్వయంగా చంద్రబాబు ట్వీట్ ద్వారానే అది బయటకు వచ్చింది. ఇక ఎమ్మెల్సీగా కూడా కొద్ది నెలల క్రితం నాగబాబు అయ్యారు.

ఆయన చట్టసభలో సభ్యుడు. మంత్రి కావడానికి ఏ రకమైన ఇబ్బందులు కూడా లేవు. కానీ మంత్రి పదవి ఎందుకు ఆలస్యం అవుతోంది అంటే అనేక ఇతర కారణాలు అని అంటున్నారు. జనసేనకు కేబినెట్ లో మూడు పదవులు ఉన్నాయి. అందులో నాదెండ్ల మనోహర్ ని పక్కన పెడితే మిగిలిన ఇద్దూరొ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే అన్నది తెలిసిందే.

ఇపుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి కట్టబెడితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే మంత్రి పదవులు అన్నది జనంలోకి బలంగా వెళ్తుంది అన్న చర్చ సాగుతోందిట. అంతే కాదు ఒకే కుటుంబంలో వారికే మంత్రి పదవులు అని కూడా భావిస్తారు అంటున్నారు.

ఇప్పటికే జనసేన ఒక ప్రాంతానికి చెందిన పార్టీ అని అంటున్నారు. అంతే కాదు ఇపుడు ఒకే సామాజిక వర్గం అని ముద్ర పడితే కనుక అది ఇబ్బంది అవుతుందని భవిష్యత్తులో పార్టీ విస్తరణకు కూడా అదే ముప్పు అవుతుందని ఆలోచిస్తున్నారుట.

ఏ రాజకీయ పార్టీకి అయినా అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరం అని అంటున్నారు. అలా జనసేన విస్తరణకు ఇబ్బందులు ఏవీ లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నారుట. అందుకే నాగబాబుకు మంత్రి పదవి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు

ఒకవేళ నాగబాబుకు మంత్రి పదవి కాకపోతే జనసేన కోటా కింద విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే అయిన కొణతాల రామక్రిష్ణకు ఆ అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయన ఉత్తరాంధ్రాకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు. పైగా ఆయన సామాజిక వర్గానికి మంత్రి పదవి కూటమి ప్రభుత్వంలో దక్కలేదు అని అంటున్నారు.

ఆయన జనసేనలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారని చెబుతున్నారు. అన్ని విషయాల్లో అవగాహన బాగా ఉన్న కొణతాలను కేబినెట్ లో తీసుకుని ముఖ్యమైన శాఖలు అప్పగిస్త జనసేనకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని ఒక చర్చ అయితే ఉందిట. మరి నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందా లేక కొణతాలకు దక్కుతుందా అన్నది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అని అంటున్నారు.