Begin typing your search above and press return to search.

మంత్రి కాదు.. మంత్రి హోదా మాత్రమే.. నాగబాబుకు ప్రత్యేక పదవి!

ఏపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపడతారని భావించిన మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది.

By:  Tupaki Political Desk   |   17 Aug 2026 2:15 PM IST
మంత్రి కాదు.. మంత్రి హోదా మాత్రమే.. నాగబాబుకు ప్రత్యేక పదవి!
X

ఏపీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపడతారని భావించిన మెగా బ్రదర్ నాగబాబుకు ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. ఆయనను ఏపీ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకోలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్ గా నియమించింది. జనసేన శాసనమండలి సభ్యుడిగా ఉన్న నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని రెండేళ్ల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో నాగబాబుకు మంత్రి పదవి దక్కలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా నాగబాబుకు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మనుగా నియమించడంతోపాటు కేబినెట్ హోదా కల్పించారు. ఈ నియామకంతో సమీప భవిష్యుత్తులో నాగబాబు మంత్రి అయ్యే అవకాశాలు లేవా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మెగా బ్రదర్ నాగబాబును ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మనుగా నియమించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ మంత్రిగా ఆయన సోదరుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు పవన్ ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే అటవీ, పర్యావరణ శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో తన లక్ష్యాన్ని మరింత వేగంగా చేరుకునే దిశగా చర్యలు చేపట్టిన పవన్ తన సోదరుడు నాగబాబు సహకారం తీసుకోవాలని భావించారని చెబుతున్నారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50 శాతం పచ్చదనం ఉండేలా ‘ఏపీ గ్రీన్’ పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ లక్ష్యం నిర్దేశించారని అంటున్నారు.

ఇక నాగబాబుకు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించిందని చెబుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఏపీ గ్రీన్ కార్యకలాపాలను పర్యవేక్షించడంతోపాటు జిల్లా స్థాయిలో పచ్చదనం అభివృద్ధి సంస్థల పనులను ఆయన చూసుకోవాల్సివుంటుందని అంటున్నారు. అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణలో నిర్దేశిత లక్ష్యాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పనిచేయాల్సివుంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకు ఈ బాధ్యతల ద్వారా మరింత బాధ్యతలు కేటాయించినట్లు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఈ నియామకం సందర్భంగా నాగబాబును మంత్రిని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీపై విస్తృత చర్చ జరుగుతోంది. 2024 డిసెంబరులో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. నిజానికి 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయాలని నాగబాబు భావించారని అంటున్నారు. అయితే ఆ సమయంలో అనూహ్యంగా బీజేపీతో పొత్తు కుదరడంతో ఆయన అనకాపల్లిని త్యాగం చేశారని, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నించగా, మళ్లీ బీజేపీయే అడ్డుపడిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ మంత్రి పదవి కట్టబెడతామని చెప్పి, ఇప్పుడు ఇలా కేబినెట్ హోదాకే పరిమితం చేయడంపైనే రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ గ్రీన్ చైర్మనుగా నాగబాబును నియమించడంతో ఇకపై ఆయనకు కేబినెట్ లో తీసుకునే అవకాశం లేనట్లేనా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ లో 25 మంది వరకు మంత్రులను తీసుకునే వీలుంది. కానీ ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మిగిలిన ఒక్క ఖాళీని నాగబాబుతో భర్తీ చేస్తారని భావించారు. అయితే ఎప్పటికప్పుడు మంత్రివర్గ విస్తరణపై ప్రచారం జరగడమే తప్ప, ఇప్పటివరకు విస్తరణ చేపట్టలేదు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశావహుడుగా ఉన్న నాగబాబుకు మంత్రి హోదాను కల్పిస్తూ తాజాగా చేసిన నియామకంతో ఇక మంత్రిగా తీసుకునే అవకాశం లేదని సంకేతాలు పంపినట్లు భావించాలని అంటున్నారు.