Begin typing your search above and press return to search.

ఏపీకి మరో మంత్రి పదవి.. చంద్రబాబు కీలక నిర్ణయం, పవన్ కే అధికారం?

అయితే దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో దక్షిణాదిలో బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ పెద్దలు ఈ సారి విస్తరణలో దక్షిణాది నుంచి కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   3 Aug 2025 11:24 PM IST
ఏపీకి మరో మంత్రి పదవి.. చంద్రబాబు కీలక నిర్ణయం, పవన్ కే అధికారం?
X

కేంద్ర మంత్రి వర్గం పునర్వ్యస్థీకరించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఏపీకి మరో మంత్రి పదవి కేటాయిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ఉండగా, అందులో ఇద్దరు టీడీపీ, ఒకరు బీజేపీకి చెందిన పార్లమెంటు సభ్యులు. ఏపీలో మూడు పార్టీల కూటమి ప్రభుత్వాన్ని నడుపుతుండగా, కేంద్రంలో బీజేపీకి టీడీపీ ప్రధాన మద్దతుదారుగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీగా 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో స్థానంలో ఉంది. అయితే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మంత్రి పదవులు కన్నా రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలన్న ఏకైక అజెండాతో రెండు పదవులనే తీసుకుంది. అయితే దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో దక్షిణాదిలో బలం పెంచుకోవాలన్న ఆలోచనతో ఉన్న బీజేపీ పెద్దలు ఈ సారి విస్తరణలో దక్షిణాది నుంచి కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఎప్పుడైనా విస్తరణ?

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 20తో ఈ సమావేశాలు ముగియనుండగా, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో కొన్ని కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో తమిళనాడు, బిహార్ వంటి ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. బిహార్ లో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం జేడీయూ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే ప్రభుత్వం నడుస్తోంది. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రం తమిళనాడులో పాగా వేయాలని బీజేపీ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. అయితే తమిళనాడులో బీజేపీ అజెండా అమలు చేయడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. దీంతో తమిళనాడులో బలపడే వ్యూహంతో ఆ రాష్ట్రానికి చెందిన మాజీ పోలీసు అధికారి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చిందని అంటున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో పార్టీ వాయిస్ వినిపించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడుకోవాలని బీజేపీ పెద్దలు వ్యూహం రచిస్తున్నారని అంటున్నారు.

తమిళనాడుపై పవన్ బాణం

ఇటీవల కాలంలో పవన్ ఎక్కువగా తమిళనాడులో పర్యటిస్తున్నారు. త్వరలో తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డిఎంకే వ్యతిరేకిస్తున్న సనాతన వాదాన్ని పవన్ ద్వారా బలపరచాలని బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. దీంతో తన మిత్రుడు పవన్ కు అధిక ప్రాధాన్యమిస్తున్న బీజేపీ.. జనసేన పార్టీకి మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఏపీలో మూడు భాగస్వామ్య పార్టీలు ఉండగా, జనసేనకు మాత్రమే కేంద్ర మంత్రి పదవి లేదు. దీంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో జనసేనకు పట్టం కట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు ఉండగా, అందులో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు బాలశౌరి సీనియర్. కాకినాడ ఎంపీ ఉదయ్ తొలిసారి గెలిచారు. అయితే వీరిద్దరు కాకుండా జనసేన నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబును కేంద్ర మంత్రిని చేయాలని పవన్ ప్రతిపాదిస్తున్నారని అంటున్నారు.

రాజ్యసభ బదులుగా కేంద్ర మంత్రి పదవి

నాగబాబును తొలుత రాజ్యసభకు నామినేట్ చేయాలని భావించారు. అయితే బీజేపీ ప్రతిసారి ఒక రాజ్యసభ స్థానాన్ని తీసేసుకుంటుండటంతో నాగబాబుకు చాన్స్ దక్కలేదు. దీంతో ఆయనను సంతృప్తి పరిచేందుకు సీఎం చంద్రబాబు గతంలో రాష్ట్రమంత్రిని చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి జనసేన కూడా ఓకే చెప్పడంతో నాగబాబు ప్రమాణస్వీకారమే లేటు అన్న ప్రచారం జరిగింది. అయితే ఏపీలో మంత్రివర్గ విస్తరణ చేపడితే కొన్ని రకాల సమస్యలు వస్తాయన్న కారణంతో నాగబాబు పదవి ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనతో ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి పంపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆశిస్తున్నారని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు చంద్రబాబు కూడా హ్యాపీగా అంగీకరించారని అంటున్నారు. బీజేపీ కూడా రాష్ట్రానికి ఒక పదవి ఇస్తామని చెప్పడం, జనసేన చాయిస్ కే వదిలేయడంతో నాగబాబు త్వరలో కేంద్ర మంత్రి అవుతారని అంటున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ద్వారా కూటమిలోని మూడు పార్టీలకు అనేక రకాల రాజకీయ ప్రయోజనాలు దక్కేలా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.