చంద్రబాబు లేని రాజకీయ పాఠం లేదు.. నాగబాబు ఆసక్తికర ట్వీట్
జన్మదిన వజ్రోత్సవాలు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివిధ వర్గాలు, రంగాలకు చెందిన వారి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 20 April 2025 3:52 PM ISTజన్మదిన వజ్రోత్సవాలు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివిధ వర్గాలు, రంగాలకు చెందిన వారి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ జీవితంపై చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గతంలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించిన వారు.. ఇప్పుడు ఆయన గొప్పతనాన్ని చెప్పేందుకు పోటీపడటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ట్వీట్ పై చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనేందుకు నాగబాబు ట్వీటే పెద్ద ఉదాహరణగా నిలుస్తోందని అంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన బావమరిది హిందుపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణను ఉద్దేశించిన నాగబాబు చేసిన ట్వీట్లు తీవ్ర వివాదాస్పదంగా ఉండేవి. నాగబాబు రాజకీయాల్లోకి వచ్చిన నుంచి చంద్రబాబును విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. అయితే ఆయన ఇప్పుడు కూటమి తరఫున ఎమ్మెల్సీగా ఉండటం, చంద్రబాబు తన లెటర్ హెడ్ పైనే నాగబాబు పేరును ఎమ్మెల్సీగా ప్రకటించడంతో ముఖ్యమంత్రిపై నాగబాబు వైఖరి పూర్తిగా మారిపోయింది.
అయితే ఎమ్మెల్సీగా గెలిచినా ఎప్పుడు చంద్రబాబు వ్యక్తిత్వంపై పెద్దగా మాట్లాడని నాగబాబు.. ఈ రోజు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు లేనిదే రాష్ట్ర రాజకీయం లేదని నాగబాబు చేసిన ట్వీట్ ఆకర్షణీయంగా ఉందంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ఎదుర్కొన్న అన్ని అవమానాలు, కష్టాలు మరే రాజకీయ నాయకుడికి ఎదురుకాలేదని మెగా బ్రదర్ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు గారి పట్టుదల నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసెంబ్లీలో ఆయనను అవమానిస్తున్నప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. గౌరవంగా తిరిగి అడుగుపెట్టారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యక్తిగత దూషణల కారణంగా మీడియా ముందు ఏడ్చినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది.’’
స్కిల్ కేసులో చంద్రబాబును జైలుకు పంపారు. కానీ, అతను విసిగిపోలేదు. చంద్రబాబు నిజమైన ఛాంపియన్, కాలం సవాళ్లను తట్టుకుని రాజనీజ్ఞుడిగా ఉన్నత స్థాయికి వెళ్లారు. చంద్రబాబు అధ్యాయం లేని రాజకీయ పాఠం లేదు అంటూ నాగబాబు తన ట్వీట్ ముగించారు. నాగబాబు ట్వీటు చూసిన వారంతా చంద్రబాబు గొప్పతనాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుంటున్నారు.
