నాగబాబుకు మంత్రి పదవి...లెక్కలు చాలా ఉన్నాయట !
మెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి దక్కే విషయంలో కొత్త లెక్కలు సరి కొత్త సమీకరణలు తెర ముందుకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Jun 2025 12:00 AM ISTమెగా బ్రదర్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి పదవి దక్కే విషయంలో కొత్త లెక్కలు సరి కొత్త సమీకరణలు తెర ముందుకు వస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. నాగబాబుకు మంత్రి పదవి ఆఫర్ ఇచ్చి ఆరు నెలలు పై దాటింది. మరి ఎపుడు మెగా బ్రదర్ మినిస్టర్ కుర్చీలో కూర్చుంటారు అంటే దీని వెనక చాలా లెక్కలు ఉన్నాయని అంటున్నారు.
నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం అన్న దానికి రాజ్యాంగబద్ధమైన ఆటంకాలు ఏవీ లేవు. పైగా కూటమి పెద్దగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాలం క్రితం ఆయనకు మంత్రి పదవి ఇస్తామని ఒక ట్వీట్ సైతం చేశారు. దాంతో నాగబాబుకు పదవి కోసం ఎప్పటికప్పుడు చర్చలు సాగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే నాగబాబుకు మంత్రి పదవికి బాబు సుముఖంగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ సైతం ఓకే చెప్పేసారు. నాగబాబు జనసేన పార్టీ కోసం కష్టపడ్డారు, అందువల్ల కుటుంబాలు కుల సమీకరణలు ఏమాత్రం అడ్డు రావు అన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇప్పటికి అయితే జనసేన నుంచి పవన్ తో కలుపుకుని ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఇక ఏపీ కేబినెట్ లో పాతిక మంది మంత్రులు తీసుకోవాల్సి ఉండగా 24 మందినే భర్తీ చేశారు. ఆ ఒక్క బెర్త్ నాగబాబు కోసమే అని అంటున్నారు.
దానిని ఎపుడు భర్తీ చేసినా నాగబాబుకే రిజర్వు అయింది అన్న టాక్ కూడా ఉంది. అయితే ఇపుడు సడెన్ గా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. అదేంటి అంటే టీడీపీ కూటమిలో మరో మంత్రి పదవిని బీజేపీ కోరుతోంది. దానికి ఢిల్లీ పెద్దల నుంచే నేరుగా ఒత్తిడి వస్తోందని అంటున్నారు. బీజేపీకి ఏపీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఒక్కరికే మంత్రి పదవి ఇచ్చారు. అదే జనసేనకు మూడు బెర్తులు ఉన్నాయి. దాంతో బీజేపీకి కనీసంగా రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాలని డిమాండ్ ఏపీ నేతల నుంచి ఉంది. అలా ఢిల్లీ స్థాయిలో పెద్దలకు వారు చెప్పడంతో అక్కడ నుంచి టీడీపీ కూటమి మీద ఒత్తిడి వస్తోంది అని అంటున్నారు.
అయితే బీజేపీకి మంత్రి పదవి ఇచ్చి నాగబాబుకు సైతం ఇవ్వాలంటే ఉన్న మంత్రులలో ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాలి. ఆ పని చేయడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాదే అయిందని ఉన్న వారిని తప్పిస్తే తప్పుడు సంకేతాలు జనంలోకి వెళ్తాయని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఒక్కటే బెర్త్ ఇద్దరి పోటీ అంటే ఎలా అన్నదే చర్చగా ఉంది.
అయితే ఇక్కడ మరో పరిష్కారం కూడా ఉంది అని అంటునారు అదేంటి అంటే తొందరలోనే కేంద్ర మంత్రివర్గం విస్తరణ చేపట్టనున్నారు అని అంటున్నారు. అందులో ఏపీ నుంచి జనసేన కోటా నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. జనసేనకు లోక్ సభ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో ఎవరికి ఛాన్స్ అన్నది పవన్ కళ్యాణ్ డిసైడ్ చేసి చెప్పాల్సి ఉంది. ఆ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు.
దాంతో వారిలో ఎవరికి చాన్స్ ఇచ్చినా ఏపీలో కూటమి కొత్తగా తీసుకోబోయే మంత్రి పదవి మీద ఆ ప్రభావం పడుతుంది అని అంటున్నారు. ఇక నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కూడా ఇక్కడే వేరే ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. నాగబాబుకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పిస్తారా అన్నది పార్టీలో చర్చగా ఉందిట. ఆయనకు అక్కడ చాన్స్ ఇస్తే ఇక్కడ జనసేన నుంచి బీసీలకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. అలాగే బీజేపీకి విస్తరణలో అవకాశం ఇస్తారు అని చెబుతున్నారు.
మరో వైపు చూస్తే కేంద్ర కేబినెట్ లో జనసేన చేరితే కాపులకు అక్కడా చోటు దక్కుతుంది. అపుడు ఏపీలో నాగబాబుకు మంత్రి చాన్స్ అన్నది పూర్తిగా తలుపులు మూసుకుపోయినట్లే అని అంటున్నారు. ఎందుకంటే మొత్తం పదవులు ఒకే సామాజిక వర్గానికి ఇస్తే విపక్షాల నుంచి విమర్శలు వస్తాయని చెబుతున్నారు.
ఇలా చాలా సమీకరణలు రాజకీయ ఆలోచనలు నాగబాబు పదవి చుట్టూ ఉన్నాయని అంటున్నారు. ఈ రకమైన ఆలోచనల మధ్యనే నాగబాబు మంత్రి పదవికి బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు. మొత్తానికి లేట్ అయినా మంచి పదవే నాగబాబును వరించి వస్తుందని అంటున్నారు. నాగబాబుకు న్యాయం చేసే విషయంలో చంద్రబాబు పవన్ తో పాటు బీజేపీ పెద్దలు సుముఖంగా ఉండడంతో ఆయనకు మంచి చాన్స్ దక్కుతుందని అంటున్నారు సో వెయిట్ అండ్ సీ.
