Begin typing your search above and press return to search.

హోం మంత్రిగా నాగబాబు? ఆ అవకాశం ఎంత?

తనకు కేటాయించిన శాఖ ద్వారా సమాజంలో మార్పు తేవాలన్న తపన నాగబాబులో ఎక్కువని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెబుతారు.

By:  Tupaki Desk   |   10 Dec 2024 10:37 AM IST
హోం మంత్రిగా నాగబాబు? ఆ అవకాశం ఎంత?
X

రాజ్యసభ సభ్యుడిగా మెగా బ్రదర్ నాగబాబుకు సీటు కన్ఫర్మ్ అన్న మాట బలంగా వినిపించినప్పటికీ.. సాంకేతిక అంశాలతో పాటు.. ఇతర అంశాల నేపథ్యంలో ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసేందుకు అవకాశం దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రిగా నాగబాబును ఎంపిక చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం.. అధికారికంగా ప్రకటన వెలువడటం లాంటివి వేగంగా జరిగిపోయాయి.

ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.. నాగబాబుకు ఏ మంత్రిత్వ శాఖల్ని అప్పజెబుతారు? అని. మెగా అభిమానులు మాత్రం నాగబాబును హోం శాఖను కట్టబెడితే బాగుంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి అనిత మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. హోం మంత్రిగా వంగలపూడి అనిత ఫెయిల్ అయినట్లుగా పవన్ భావిస్తున్నారని.. అందుకే తన సోదరుడికి ఆ పదవిని ఇప్పించుకుంటారన్న మాట బలంగా వినిపిస్తోంది.

అయితే.. లాజికల్ గా చూసినా హోం మంత్రి పదవిని నాగబాబుకు అప్పజెప్పేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉంటారా? అన్నది సందేహమే. కారణం.. వెనుకబడిన కులాలకు చెందిన మహిళ కావొచ్చు.. ఆచితూచి అడుగులు వేయాల్సిన హోం శాఖను నాగబాబుకు ఉండే ఆవేశానికి సూట్ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు అనిత స్థానంలో నాగబాబును నియమిస్తే.. పార్టీ వర్గాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే వీలుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. కీలకమైన శాఖల్లో ఏదో ఒక దానిని కట్టబెట్టే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సామాజిక అంశాలతో ముడి పడి ఉండే శాఖను ఇచ్చే వీలుందని తెలస్తోంది.

తనకు కేటాయించిన శాఖ ద్వారా సమాజంలో మార్పు తేవాలన్న తపన నాగబాబులో ఎక్కువని ఆయనతో సన్నిహితంగా ఉండేవారు చెబుతారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ తరహాలో శాఖను అప్పజెప్పే వీలున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కేటాయించిన శాఖలను తీసి నాగబాబుకు అప్పజెప్పే కన్నా.. మంత్రులకుకేటాయించని శాఖల్లో కొన్నింటిని నాగబాబుకు అప్పజెప్పే వీలున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ అంచనాల్లో ఏది నిజమవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.