Begin typing your search above and press return to search.

పురంధేశ్వరితో నాదెండ్ల కీలక మీటింగ్ వెనక...!?

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరితో జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక చర్చలు జరిపారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   4 Jan 2024 5:17 PM GMT
పురంధేశ్వరితో నాదెండ్ల కీలక మీటింగ్ వెనక...!?
X

బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరితో జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ కీలక చర్చలు జరిపారని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున నాదెండ్ల బీజేపీతో మాట్లాడారని అంటున్నారు. పవన్ నుంచి కీలక సందేశం కూడా ఆయన పురంధేశ్వరి సహా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) శివ ప్రకాష్ తో కూడా నాదెండ్ల మాట్లాడినట్లుగా చెబుతున్నారు.

ఏపీలో జనసేన బీజేపీతో పొత్తులో ఉంటూనే టీడీపీతో మరో పొత్తు కుదుర్చుకుంది. అదే టైం లో బీజేపీని కూడా పొత్తుకు రమ్మని చాలా కాలంగా కోరుతోంది. బీజేపీ జాతీయ పార్టీ. అందువల్ల ఆ పార్టీ తన జాతీయ అవసరాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏపీ విషయం తేల్చడం లేదు. ఇపుడు ఆ టైం వచ్చింది అని అంటున్నారు. అందుకే విజయవాడలో గురువారం బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ తీసుకునే నిర్ణయం ఏదైఅనా తమకు అనుకూలం చేసుకోవాలని జనసేన నేత నాదెండ్ల వచ్చారని అంటున్నారు. ఆయన పురంధేశ్వరితో ఏమి మాట్లాడారు అన్నది తెలియకపోయినా కూటమిలో చేరమని కోరి ఉంటారని అంటున్నారు. ఏ నిర్ణయం అయినా తొందరగా తీసుకోవాలని కోరినట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా శివ ప్రకాష్ అయితే బీజేపీ కోర్ కమిటీ అభిప్రాయాలు ఏపీలో పొత్తు విషయంలో సేకరించారని అంటున్నారు. అయితే మెజారిటీ నేతలు మాత్రం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు. ఏపీలో జగన్ తో బీజేపీ తెర వెనక బంధాన్ని కొనసాగిస్తోందని ప్రజలకు సంకేతాలు వెళ్తున్నాయని అది కాదు అన్నట్లుగా రుజువు చేసుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చాలా మంది నేతలు చెప్పారని అంటున్నారు.

ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ ఎస్ తో బీజేపీకి అవగాహన ఉందని జనాలు భావించడం వల్ల కాంగ్రెస్ గెలిచిందని కూడా గుర్తు చేశారని అంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని వాటి మీద విచారణ జరిపించడం ద్వారా వైసీపీతో బీజేపీకి ఏమీ సంబంధం లేదని జనాలకు కచ్చితంగా చెప్పవచ్చు అని సూచించినట్లుగా తెలిసింది.

ఇక కోర్ కమిటీ మెంబర్స్ చెప్పిన దాన్ని విన్న శివ ప్రకాష్ వాటిని రాతపూర్వకంగా రాసి ఇమ్మని కోరినట్లుగా చెబుతున్నారు. దానిని బీజేపీ హై కమాండ్ ముందు పెట్టి తగిన విధంగా యాక్షన్ ఉండేలా చూసామని హామీ ఇచ్చారని అంటున్నారు.

మొత్తానికి చూస్తే జనసేన తరఫున నాదెండ్ల మోసుకొచ్చిన సందేశంతో పాటు బీజేపీ కోర్ కమిటీ మెంబర్ల అభిప్రాయాలు అన్నీ కలసి కేంద్ర బీజేపీ అధినాయకత్వం తొందరలోనే ఏపీలో పొత్తుల మీద ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది అని అంటున్నారు. చూడాలి మరి.