Begin typing your search above and press return to search.

అవును.. మైసూర్ మహారాజుకు సొంతిల్లు లేదు.. అఫిడవిట్ ఏం చెప్పారంటే?

తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మైసూర్ - కొడగు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా యదువీర్ క్రిష్ణదత్త చామరాజు వడయార్ నామినేషన్ దాఖలు చేశారు.

By:  Tupaki Desk   |   2 April 2024 6:00 AM GMT
అవును.. మైసూర్ మహారాజుకు సొంతిల్లు లేదు.. అఫిడవిట్ ఏం చెప్పారంటే?
X

ఎన్నికల వేళ నేతలు ఎన్నికల సంఘం అధికారులకు దాఖలు చేసే అఫిడవిట్లు ఆసక్తికర అంశాల్ని వెల్లడిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒక అంశం అందరూ మాట్లాడుకునేలా చేసింది. అదేమంటే.. అత్యంత ధనిక రాజకుటుంబాల్లో ఒకటిగా చెప్పే మైసూర్ మహరాజుకు సొంత ఇల్లు.. సొంత కారు లేదన్న విషయాన్ని తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మైసూర్ - కొడగు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా యదువీర్ క్రిష్ణదత్త చామరాజు వడయార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు.

గతంలో మైసూర్ రాజకుటుంబానికి చెందిన శ్రీకంఠ దత్త నరసింహరాజు వడియార్ తర్వాత మళ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నది యదువీర్ మా్తరమే. గతంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లోని పలు రాజకుటుంబాలకు చెందిన వారసులు ఎన్నికల్లో పోటీ చేయటం తెలిసిందే. రెండు దశాబ్దాల తర్వాత మైసూర్ రాజవంశానికి చెందిన వారు ఎన్నికల బరిలోకి దిగుతుననారు. ఎన్నికల బరిలోకి దిగిన మైసూర్ రాజకుటుంబానికి చెందిన యదువీర్ క్రిష్ణదత్త.. తాజాగా తన నామినేషన్ దాఖలు సందర్భంగా అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తన మొత్తం ఆస్తుల విలువ రూ.4.99 కోట్లుగా పేర్కొన్న ఆయన.. ఇప్పటికి తనకు సొంతంగా ఇల్లు లేదని.. సొంతంగా కారు లేదని పేర్కొన్నారు.

తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల్ని ఆయన వెల్లడించారు. తన సతీమణి త్రిషక కుమారీ వడియార్ కు రూ.1.04 కోట్లు.. వారి సంతానం పేరు మీద రూ.3.64 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం ఆస్తుల్లో రూ.3.39 కోట్ల విలువైన బంగారం.. వెండి నగల రూపంలో ఉన్నట్లుగా యదువీర్ పేర్కొన్నారు. తన భార్యకు రూ.1.02 కోట్ల విలువైన ఆభరణాలు..వారి సంతానానికి రూ.24.50 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరి ముగ్గురికి ఎలాంటి స్థిరాస్తులు లేకపోవటం గమనార్హం.

మైసూర్ రాజ్యాన్ని వడియార్ కుటుంబం 1339 నుంచి 1950 వరకు పాలించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మైసూరు రాజు జయచామ రాజేంద్ర వడయార్ గవర్నర్ గా నియమితులయ్యారు. శ్రీకంఠ దత్త నరసింహరాజ వడియార్ 1974లో రాజు అయ్యారు. 1984-1999 మధ్య కాంగ్రెస్ ఎంపీగా మైసూర్ నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. 2013లో ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే.

తర్వాత రెండేళ్లకు యదువీర్ మైసూర్ రాజుగా పట్టాభిషిక్లుతయ్యారు. ఆయన మైసూర్ 27వ రాజు. మసాచుసెట్స్ వర్సిటీలో ఆంగ్ల సాహిత్యం.. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన ఆయన 2016లోదుంగాపుర్ కు చెందిన యువరాణి త్రిషకను పెళ్లాడారు. నిజానికి ఆయన ఏప్రిల్ 3న నామినేషన్ దాఖాలు చేయాల్సి ఉన్నప్పటికీ.. మంచి రోజు కావటంతో రెండు రోజుల ముందే ఆయన తన నామినేషన్ ను దాఖలు చేశారు.