కాంగ్రెస్ - బీజేపీ మధ్యలో తమన్నా... మళ్లీ మొదలైంది!
కర్ణాటక ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక "మైసూర్ శాండల్ సోప్" బ్రాండ్ అంబాసిడర్ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో గత ఏడాది మే నెలలోనే సుమారు రూ.6.2 కోట్లకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.
By: Raja Ch | 10 Feb 2026 11:00 PM ISTకర్ణాటక ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రతిష్టాత్మక "మైసూర్ శాండల్ సోప్" బ్రాండ్ అంబాసిడర్ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాతో గత ఏడాది మే నెలలోనే సుమారు రూ.6.2 కోట్లకు ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అప్పట్లో తీవ్ర దుమారమే రేపిందని చెప్పొచ్చు. కర్ణాటకలో హీరోయిన్స్ లేరా.. ముంబైలో జన్మించిన తమన్నా భాటియానే కావాలా అంటూ ప్రతిపక్షాలతో పాటు పలు సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో.. వివాదం మళ్లీ మొదలైంది.
అవును... కర్ణాటక ప్రభుత్వానికి చెందిన "మైసూర్ శాండల్ సోప్" బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాతో గత ఏడాది మే లో చేసుకున్న ఒప్పందం నేటి నుంచి (ఫిబ్రవరి 10) అమల్లోకి రావడంతో వివాదం మళ్లీ మొదలైంది. ఈ సందర్భంగా స్పందించిన ఆ రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్... 2030 నాటికి వార్షిక టర్నోవర్ ను రూ.5,000 కోట్లకు పెంచాలనే మైసూర్ శాండల్ సోప్, కర్ణాటకా సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కే.ఎస్.డీ.ఎల్) లక్ష్యాన్ని పునఃప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... ఒక శతాబ్ధానికి పైగా విస్తరించిన వారసత్వం ఇప్పుడు స్పష్టమైన దార్శినికతతో భవిష్యత్తులోకి ధైర్యంగా అడుగుపెడుతోందని.. గొప్ప దార్శనికుడు మహారాజా సల్వాడి కృష్ణరాజ వడియార్ దూరదృష్టితో స్థాపించబడిన కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కొత్త దశలోకి ప్రవేశిస్తోందని.. ఈ క్రమంలో 2030 నాటికి రూ.5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ పోస్టులో బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా ఉన్న ఫోటో ఉంది!
మొదలుపెట్టిన బీజేపీ!:
దీంతో.. ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ సుధాకర్ స్పందించారు. ఈ సందర్భంగా.. ‘మన కన్నడ భూమి నుంచి చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కర్ణాటకలోని ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్ మైసూర్ శాండల్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా వేరే రాష్ట్రం, వేరే భాషకు చెందిన సినీ నటిని నియమించింది.. ఆమెకు కోట్లాది రూపాయలు చెల్లించింది.. ఇది కాంగ్రెస్ పార్టీ కన్నడ వ్యతిరేక మనస్తత్వానికి మరో నిదర్శనం’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా రమ్య, రష్మిక మందన, రుక్మిణి వసంత్, పూజా హెగ్డే, శ్రీనిధి శెట్టి వంటి కన్నడ స్టార్స్ ని ఉదహరిస్తూ.. వీరికీ చిత్ర పరిశ్రమలలో డిమాండ్ ఉందని.. వారికంటే ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం కన్నడ ప్రతిభకు అవమానం మాత్రమే కాదు.. మైసూర్ శాండల్ సబ్బు గర్వానికీ తీవ్ర అవమానమనీ అన్నారు. దీంతో... కాంగ్రెస్ - బీజేపీ మధ్య తమన్న ఫైట్ మళ్లీ మొదలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
