మైసూర్ పాక్ చరిత్ర ఇదే.. పేరు మార్చొద్దు!
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల నేపథ్యంలో పాకిస్థాన్ పై యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 May 2025 6:34 PMపహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ల నేపథ్యంలో పాకిస్థాన్ పై యావత్ భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ తో వారి ఆగ్రహం కాస్త చల్లారినా.. కాల్పుల విరమణ అనంతరం తిరిగి కొంత వేడెక్కినట్లు చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే.. ఈ సమయంలో పలు వంటకాల్లో "పాక్" అనే పేరును తొలగిస్తోన్న సంగతి తెలిసిదే!
ఇందులో భాగంగా రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రముఖ స్వీట్ షాప్ యజమాని.. మైసూర్ పాక్ ని "మైసూర్ శ్రీ"గా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఇదే సమయంలో.. మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ ల పేర్లు కూడా మార్చి, మోతీ శ్రీ, ఆమ్ శ్రీ, గోండ్ శ్రీ అని కొత్త పేర్లు పెట్టారు. దీనిపై నటరాజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అవును... ఓ స్వీట్ల దుకాణం మైసూర్ పాక్ ను మైసూర్ శ్రీగా మార్చిన విషయం నెట్టింట వైరల్ అయిన వేళ.. ఈ విషయంపై రాయల్ కుక్ కకాసుర మడప్ప మునిమనవడు ఎస్ నటరాజ్ స్పందించారు. మైసూర్ పాక్ పేరు మార్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ స్వీట్ చరిత్ర, అర్ధం తెలియక అలా పేరు మారుస్తున్నారన్నట్లుగా స్పందించారు!
ఈ సందర్భంగా... మైసూర్ పాక్ ని మైసూర్ పాక్ అనే పిలవండి అని కోరిన నటరాజ్.. మన పూర్వీకులు అందించిన ఆవిష్కరణకు మరో పేరు ఉండదని అన్నారు. కన్నడలో "పాక" అంటే చక్కెర లేద బెల్లంతో చేసే పదార్ధం అని.. దీనిని తొలుత మైసూర్ లో తయారుచేయడం వల్ల దీనికి "మైసూర్ పాక్" అని పేరు వచ్చిందని తెలిపారు.
ఇదే సమయంలో.. మైసూర్ పాక్ ని వేరే పేరుతో పిలవడం అనవసరమని.. దీనికి వేరే అర్ధాలు తీయోద్దని నటరాజ్ కోరారు. కాగా.. మైసూర్ వడయార్ రాజకుటుంబానికి ఈ కకాసుర మడప్ప వంటవాడిగా ఉండేవారు. ఈ మైసూర్ పాక్ స్విట్ ని ఆయనే తొలిసారిగా తయారు చేశారు. దీంతో.. ఈ తయారీ క్రెడిట్ ఆయనకే దక్కింది!