Begin typing your search above and press return to search.

బాగా హుషారు... రోజులో 48 గంటల కరెంట్‌ హామీ!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గరపడుతుంది. అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 4:11 AM GMT
బాగా హుషారు... రోజులో  48 గంటల కరెంట్‌  హామీ!
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ తేదీ దగ్గరపడుతుంది. అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నారు. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ హామీల వర్షంలో ప్రజలు తడిచి ముద్దవుతున్నారు.. అరచేతిలో కనిపిస్తున్న స్వర్గాన్ని చూసి ఆశ్చరపోతున్నారు! ఈ క్రమంలో ఒక యువనేత... రోజులో 48 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది!

అవును... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. ప్రధానంగా అధికార బీఆరెస్స్ ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. బీఆరెస్స్ నేతలు కూడా తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మైనంపల్లి హన్మంత రావు కుమారుడు, మైనంపల్లి రోహిత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వైద్యవిద్య నభ్యసించిన 26ఏళ్ల మైనంపల్లి రోహిత్ రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. వీదుల్లో ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. ఈదఫా ఎన్నికల్లో పోటీచేస్తున్న అతి చిన్న వయస్కుడిగా కూడా రోహిత్ రికార్డ్ సృష్టించారని అంటున్నారు! ఈ సమయలో ప్రచారంలో భాగంగా మైకందుకున్న ఆయన... రోజులో 48 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగా... "మన చేతి గుర్తు ప్రభుత్వం వచ్చినాక అవసరమైతే రోజుకి 48 గంటలు ఉంటే 48 గంటలు కూడా కరెంట్ ఇస్తాం. అట్లాంటోళ్లం. ఇప్పుడున్నదానికంటే అవసరం ఉంటే, నిజంగా అవకాశముంటే రోజుకి 25 గంటలు ఉంటే ఒక గంట ఎక్కువగానే ఇస్తాం తప్ప తక్కువ ఇయ్యం" అని తెలంగాణ ప్రజానికానికి, ప్రధానంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లకు హామీ ఇచ్చారు.

బీఆరెస్స్ పార్టీ కంటే ఎక్కువ వాగ్ధానాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా చెప్పారో.. లేక, చిన్నవయసులోనే టిక్కెట్ రావడంతో కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారో తెలియదు కానీ... రోజులో 48 గంటలు ఉంటే 48 గంటలు అనడం ఒకెత్తు అయితే... రోజులొ 25 గంటలు ఉంటే... ఒక గంట ఎక్కువే ఇస్తాం తప్ప తక్కువ ఇయ్యం అని చెప్పడాన్ని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

దీంతో... చదువుకున్న వ్యక్తులు కూడా ఇలా టంగ్ స్లిప్ వాగ్ధానాలు చేస్తే ఎలా అని కొందరంటే... వాట్సప్ యూనివర్శిటీల్లో చదువుకున్నవారిలా మాట్లాడొద్దని మరికొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా... చిన్న వయసులోనే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకున్న రోహిత్ ఇలాంటి ట్రోల్స్ కి గురయ్యే మాటలు మాట్లాడితే ప్రమాదమే అనేది మరికొందరు చెబుతున్న మాట!

కాగా... ఫస్ట్ టైం ఎమ్మెల్యే గా పోటీచేయబోతున్న మైనంపల్లి రోహిత్ కు మెదక్ జిల్లాల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి బీఆరెస్స్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక, బీజేపీ నుంచి పంజా విజయ్‌ కుమార్ పోటీలో ఉన్నారు. ఈయనకు గతంలో జెడ్.పీ.టీ.సీ.గా పనిచేసిన అనుభవం ఉంది.