Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ అభ్యర్థికి "సన్" స్ట్రోక్... అతని ఓటమికి కొడుకు ప్రచారం!

ఎన్నికల సీజన్ వచ్చిందంటే... పార్టీల్లోనే అసంతృప్తులు తెరపైకి వస్తుంటారు.

By:  Tupaki Desk   |   1 May 2024 4:27 AM GMT
వైసీపీ ఎంపీ అభ్యర్థికి సన్ స్ట్రోక్... అతని ఓటమికి కొడుకు ప్రచారం!
X

ఎన్నికల సీజన్ వచ్చిందంటే... పార్టీల్లోనే అసంతృప్తులు తెరపైకి వస్తుంటారు. ఈ విషయంలో అన్నపై చెల్లి, తమ్ముడు.. తమ్ముడిపై అన్న.. వదిన, మరిది.. ఇలా రకరాకాల పోటీలు కుటుంబ సభ్యుల మధ్యే నెలకొని ఉంటుంటాయి. ఇటీవల శ్రీకాకుళంలో భర్తపై భార్య రెబల్ గా పోటీ చేస్తుందనే వార్తలూ వచ్చాయి. ఈ క్రమంలో... పోటీ లేదు కానీ.. తండ్రి కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు ఓ సుపుత్రుడు!


అవును... వాస్తవానికి ఇంట్లో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తుంటే... వారి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రచార రంగంలోకి దిగుతుంటారు.. వారి తరుపున భారీ ఎత్తున ప్రచారం చేస్తుంటారు. అయితే... రోటీన్ కి భిన్నంగా... ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రిని ఓడించండి అంటూ ఓ కుమారుడు సంబంధించిన పోస్టర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... అనకాపల్లి ఎంపీ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడి కుమారుడు రవికుమార్.. మాడుగుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. దీంతో అనకాపల్లి జిల్లాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ క్రమంలో... మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ముత్యాల నాయుడు కుమారుడు రవికుమార్ తండ్రికి మరో షాకిచ్చారు.

ఇందులో భాగంగా.. తన తండ్రిని ఓడించండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ పోస్టర్ కలకలం రేపుతోంది. "కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు.. ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు..? ఆలోచించి ఓటు వేయండి. మా నాన్న బూడి ముత్యాలనాయుడిని ఓడించండి" అని ఆ పోస్టర్‌ లో పేర్కొన్నారు. అయితే ఈ స్థాయి "సన్ స్ట్రోక్" వెనకున్న అసలు కారణం వేరే అని అంటున్నారు స్థాన్నికులు!

వాస్తవానికి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన డిప్యూటీ సీఎంగానూ ఉన్నారు. అయితే ఆయనకు ముందు మాడుగుల టికెట్ ప్రకటించిన జగన్... ఆ తర్వాత అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. దీంతో మాడుగుల స్థానం ఆయన రెండో భార్య కుమార్తె అనురాధకు కేటాయించారు! దీనిపై ఆయన మొదటి భార్య కుమారుడు రవి ఆగ్రహంగా ఉన్నారు!

అప్పటినుంచి రవి.. తన తండ్రి తీరుపై అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు! ఈ సమయంలోనే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా... "మా నాన్న తులసి మొక్కే.. 2019 తర్వాత ఆ మొక్కకి కొన్ని పురుగులు పట్టాయి.. జగన్‌ ని నమ్ముకొని 9 ఏళ్లు ఆయన వెంట తిరిగాను.. ఏనాడూ ముత్యాలనాయుడి కుమారుడిగా పార్టీలో తిరగలేదు.. అయిదేళ్ల నుంచి నన్ను రాజకీయంగా తొక్కడం మొదలుపెట్టారు" అంటూ రవి ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో... ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది!