Begin typing your search above and press return to search.

మజ్లిస్ ను వ్యతిరేకిస్తున్న ముస్లింలు?

కానీ ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం మజ్లిస్ పార్టీ తీరుపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   16 Nov 2023 10:30 AM GMT
మజ్లిస్ ను వ్యతిరేకిస్తున్న ముస్లింలు?
X

ఎమ్ఐఎమ్ పార్టీకి ముస్లింలే బలం. ముస్లింలు ఎక్కువగా ఉండే పాతబస్తీలో మజ్లిస్ కు తిరుగులేదు. తెలంగాణ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టిన అన్ని చోట్లా దాదాపుగా ఆ పార్టీ గెలుస్తుందంటే అందుకు ముస్లిం ఓట్లే కారణం. కానీ ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో మాత్రం మజ్లిస్ పార్టీ తీరుపై ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గోషామహల్ లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ పై అభ్యర్థిని బరిలో దించకపోవడం, మరోవైపు అజహరుద్దీన్ పోటీ చేస్తున్న జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని పోటీకి దించడంతో మజ్లిస్ పై ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గోషామహల్ లో బీజేపీ నాయకుడు రాజాసింగ్ వరుసగా రెండు సార్లు గెలిచారు. ఈ సారి కూడా పోటీ చేస్తున్నారు. గతంలో మహమ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్ ను ఓడిస్తామని మజ్లిస్ ప్రకటించింది. కానీ పోటీలో మాత్రం దిగలేదు. గోషామహల్ నియోజకవర్గంలో 79 వేలకు పైగా ముస్లిం ఓటర్లున్నారు. పైగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోనే గోషామహల్ ఉంది. అయినా పోటీకి దూరంగా ఉంది.

మరోవైపు కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ లో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పోటీ చేస్తున్నారు. అక్కడ మజ్లిస్ నుంచి రషీద్ ఫరాజుద్దీన్ బరిలో నిలిచారు. ఇక్కడ 1.20 లక్షలకు పైగా మైనారిటీ ఓటర్లున్నారు. అయితే ఇప్పుడు అజహరుద్దీన్ ను ఓడించడమే లక్ష్యంగా మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టడంతో ముస్లిం వర్గాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నట్లు తెలిసింది. గోషామహల్ లో ఏమో అభ్యర్థిని నిలబెట్టకుండా, జూబ్లీహిల్స్ లోనేమో అభ్యర్థిని నిలబెట్టి బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేలా మజ్లిస్ వ్యవహరించడాన్ని ముస్లిం ప్రజలు వ్యతిరేకిస్తున్నారని టాక్. మజ్లిస్ తీరుతో ముస్లిం ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.