రోడ్ల మీదకు ముస్లింలు.. ఉగ్రదాడి పై ఆగ్రహం.. ఎంత భారీగా అంటే?
తాజాగా శుక్రవారం జరిపే ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో దేశంలోని ముస్లింలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి ఉగ్రదాడికి వ్యతిరేకంగా గళం విప్పారు.
By: Tupaki Desk | 26 April 2025 9:52 AM ISTపహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిపై యావత్ దేశం రగిలిపోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా శుక్రవారం జరిపే ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో దేశంలోని ముస్లింలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి ఉగ్రదాడికి వ్యతిరేకంగా గళం విప్పారు. నిరసనలు చేపట్టారు. నల్లరంగు బ్యాండ్లు ధరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజా దాడి నేపథ్యంలో పాక్ పై దౌత్యపరంగా.. సైనిక పరంగా.. కఠిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ చేశారు.
ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తులు తమను తాము ముస్లింలుగా చెప్పుకుంటున్నా.. వారి చర్య ఇస్లామ్ మతానికి పూర్తి విరుద్ధంగా స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని చారిత్రక జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. ఉగ్రదాడిని తప్పు పడుతూ దేశ వ్యాప్తంగా ముస్లింలు రోడ్ల మీదకు వచ్చారు. మరణించిన వారికి సంతాపాన్ని తెలియజేయటంతో పాటు.. మారణహోమానికి మతంతో ముడిపెట్టిన తీరును తప్పు పట్టారు.
పాక్ మీద తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలని పదే పదే ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు వ్యక్తం చేశారు. చేతులకు నల్ల రిబ్బన్లు.. దుస్తులకు నల్లబ్యాడ్జీలు ధరించటం ద్వారా తమ నిరసనను తెలియజేశారు. హైదరాబాద్ మహానగరంలో ఈ శుక్రవారం రోటీన్ కు భిన్నమైన సన్నివేశం ఆవిష్క్రతమైంది. మసీదుల్లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యే ముస్లింలతో పాటు.. మిగిలిన వారు సైతం నల్లరిబ్బన్ ధరించటం ద్వారా ఉగ్రదాడిని తాము ఎంతలా ఖండిస్తున్నామన్న విషయాన్ని చేతల్లో చూపించారు. పలుచోట్ల నిరసనలు చేపట్టారు.
