Begin typing your search above and press return to search.

ఇది ఇండియా అంటే: ముస్లిం పేరెంట్స్.. లింగాయత కొడుకులు

ఇంట్లోని వారిని సైతం పరాయి వారిగా చూడటం.. కన్నతల్లిదండ్రులను భారంగా భావిస్తూ బయటకు పంపేసే దుర్మార్గులు ఉన్నారు.

By:  Garuda Media   |   12 Feb 2026 9:57 AM IST
ఇది ఇండియా అంటే: ముస్లిం పేరెంట్స్.. లింగాయత కొడుకులు
X

ఇంట్లోని వారిని సైతం పరాయి వారిగా చూడటం.. కన్నతల్లిదండ్రులను భారంగా భావిస్తూ బయటకు పంపేసే దుర్మార్గులు ఉన్నారు. అదే సమయంలో.. తమ పేగు తెంచుకొని పుట్టకపోయినా.. అంతకు మిన్నగా పెంచి..పెద్ద చేసే మంచి మనస్కులు మనచుట్టూ ఉన్నారు. ఇలాంటి వారికి మతాలు.. కులాలు పట్టవు. ఆ మాటకు వస్తే అదే అసలుసిసలైన భారత ఆత్మ. భిన్నత్వంలో ఏకత్వం అనే మాటకు నిలువెత్తు రూపంగా మన దేశం నిలుస్తుంది. ఇప్పుడంటే ఎవరికి వారు ప్రాంతాలు.. కులాలు.. మతాలు.. వర్గాల వారీగా విడిపోతున్నారుబకానీ.. వసుధైక కుటుంబానికి నిలువెత్తు రూపంగా భారత్ ఉంటుంది. ఇప్పటికి పాతవాసనలు పోకుండా భారత ఆత్మను కాపాడే వారు కొందరు ఉంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం ఈ కోవకు చెందిన వారే.

కర్ణాటకలోని హుక్కేరి తాలూకా బస్తెవాడకు చెందిన మెహబూబ్ హాసన్.. నూర్జహాన్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరి మంచితనం.. పెద్దమనసు గురించి తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే. వీరి పొరుగన లింగాయత్ ధర్మాన్ని పాటించే కాడయ్య, శైల దంపతులు ఉండేవారు. మతాలు వేరు అయినప్పటికి ఈ రెండు కుటుంబాల మధ్య ఉండే అనుబంధం మాటలకు అందనిది. మతం వీరి మధ్య విషయం కానే కాదు. కాడయ్య, శైల దంపతులకు ఇద్దరు కొడుకులు ఉండేవారు. అనూహ్యంగా పిల్లలు నాలుగేళ్లు, రెండేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు.

దీంతో తన స్నేహితుల పిల్లల బాధ్యతను నూర్జహాన్ దంపతులు తీసుకున్నారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించారు. అదే సమయంలో వారు పాటించే లింగాయత్ ధర్మాన్ని కొనసాగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలా వారి పెంపకంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యారు. తాజాగా పెద్దోడు సోమశేఖర్ కు పెళ్లి చేశారు. పూనం అనే వధువుతో లింగాయత సంప్రదాయం ప్రకారం వారి పెళ్లి జరిగింది.

తమ స్నేహానికి మతం ఎప్పుడు అడ్డు కాలేదన్న మెహబూబ్..తన స్నేహితులు కాలం చేసిన తర్వాత పిల్లల్ని తాము దత్తత తీసుకున్నామని.. కానీ వారి సంప్రదాయాల్ని అనుసరించేందుకు తాము అడ్డు చెప్పలేదని చెప్పారు. ఇది కదా అసలుసిసలు భారత ఆత్మ అంటే. తాము సొంత పిల్లలుగా సాకిన వారు ముస్లిం ధర్మాన్ని పాటించకున్నా తమ పిల్లలుగానే పెరిగినట్లుగా పెంపుడు తల్లి నూర్జహాన్ చెప్పటం చూస్తే.. మతం కంటే మానవత్వం గొప్పదన్న విషయానికి నిలువెత్తురూపంగా ఆమె నిలుస్తారు.