Begin typing your search above and press return to search.

పాక్ తో చర్చలు.. మావోల హత్యలు.. ఇదేం నీతి.. కడిగేసిన పీపుల్స్ స్టార్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   7 Jun 2025 9:26 AM IST
పాక్ తో చర్చలు.. మావోల హత్యలు.. ఇదేం నీతి.. కడిగేసిన పీపుల్స్ స్టార్
X

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ కగార్, ఆపరేషన్ సింధూర్ చర్చనీయాంశంగా మారాయి. చర్చలకు సిద్ధమని చెబుతున్న మావోయిస్టులను 'ఆపరేషన్ కగార్' పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపుతున్న కేంద్రం, మరోవైపు నిత్యం పౌరుల ప్రాణాలు తీస్తున్న పాకిస్తాన్‌తో 'ఆపరేషన్ సింధూర్'ను నిలిపివేసి చర్చలు జరపడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టాలీవుడ్ నటుడు, నిర్మాత ఆర్. నారాయణ మూర్తి హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ట్రంప్ ఆపమన్నాడని, పాకిస్తాన్ చర్చలు జరిపాడని యుద్ధం ఆపిన మీరు.. శాంతి చర్చలకు సిద్ధమని చెబుతున్న మావోయిస్టులను ఆపరేషన్ కగార్ పేరుతో ఎందుకు చంపుతున్నారు?" అని ఆర్. నారాయణ మూర్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సూటిగా ప్రశ్నించారు.

హిందూ సంప్రదాయాలపై ప్రశ్నలు

ఆర్. నారాయణ మూర్తి బీజేపీని ఉద్దేశించి, "హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే కర్మకాండ జరుపుతారు. అలాంటిది, ఆపరేషన్ కగార్‌లో చనిపోయిన వారి మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు చూపించకుండా, వారి చేతులతో కర్మకాండలు జరిపించకుండా చేస్తున్న మీరు ఏం హిందువులు? మీదేం హిందూ పార్టీ?" అంటూ మండిపడ్డారు. దేశ సంపద దేశ మూలవాసులకే చెందాలని పోరాటం చేస్తున్న మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్నా, వారిని ఆపరేషన్ కగార్ పేరుతో చంపడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.

మావోయిస్టుల పోరాటంపై నారాయణ మూర్తి వ్యాఖ్యలు

తల్లిదండ్రులను, ఇల్లు, వాకిలిని వదులుకుని, ప్రాణభయం లేకుండా పోరాటాలు చేస్తున్న మావోయిస్టులను కేంద్రం ఇలా దారుణంగా చంపడం ఏం న్యాయమని ఆర్. నారాయణ మూర్తి ప్రశ్నించారు. దాయాది దేశం పాకిస్తాన్‌తో చర్చలు జరిపిన మీరు, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్న ఈ దేశవాసులను చంపడం ఏంటన్నారు. "ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం అడవిలో ఉన్నవారు ఆల్ రైట్" అని ఆయన స్పష్టం చేశారు. హిందువుల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నవారు, చనిపోయిన వారి కర్మకాండలు జరుపుకోవడానికి కూడా మృతదేహాలు ఇవ్వకపోవడం సరికాదని ఆయన నొక్కి చెప్పారు.