Begin typing your search above and press return to search.

రాష్ట్రపతికే సుప్రీం పవర్.. తేల్చిచెప్పిన ద్రౌపది ముర్ము

రాష్ట్రాలు, కేంద్రం పంపించే బిల్లులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభ్యంతరం వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   15 May 2025 2:00 PM IST
రాష్ట్రపతికే సుప్రీం పవర్.. తేల్చిచెప్పిన ద్రౌపది ముర్ము
X

రాష్ట్రాలు, కేంద్రం పంపించే బిల్లులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో లేని గడువును సుప్రీంకోర్టు ఎలా నిర్ణయిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఇటీవల గవర్నర్లు, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగులో ఉండిపోవడంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్వోన్నత న్యాయస్థానానికి పలు ప్రశ్నలు వేశారు.

శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు తీవ్ర జాప్యానికి గురికావడంపై సుప్రీంకోర్టులో కొద్దిరోజుల క్రితం విచారణ జరిగింది. తమిళనాడు గవర్నర్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా బిల్లులు తొక్కిపెట్టడం సరికాదని భావించిన సుప్రీంకోర్టు నిర్దేశిత కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లులను పరిష్కరించాలని సూచిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనట్లు గవర్నర్లతోపాటు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రథమ పౌరురాలు సుప్రీంతీర్పుపై తన అభ్యంతరాలు తెలియజేసినట్లు సమాచారం.

గడువులోగా బిల్లులు ఆమోదించాలనే నిబంధన ఏదీ రాజ్యాంగం లేదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. రాజ్యాంగంలోని లేని అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇస్తుందని రాష్ట్రపతి ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి పలు ప్రశ్నలు సంధించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అంతేకాకుండా తన ప్రశ్నలకు న్యాయస్థానం తగిన సమాధానం ఇవ్వాలని రాష్ట్రపతి కోరినట్లు ఆ కథనాల్లో ఉంది. కాగా, రాష్ట్రపతి అభ్యంతరాలపై తగిన సమాధానం ఇచ్చేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా పెండింగులో ఉంచడంపై ఈ ఏడాది ఏప్రిల్ లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు నిచ్చింది. సకాలంలో బిల్లులు ఆమోదించకపోవడం సరికాదన్న కోర్టు 415 పేజీలతో తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి లేదా గవర్నర్ గరిష్ఠంగా మూడు నెలల్లోకా ఆమోదించడమో? తిప్పిపంపడమో? చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపితే అందుకు గల కారణాలను జత చేయాలని ఆ తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్షపరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్జిస్ ఆర్.మహదేవన్ ధర్మాసనం స్పష్టం చేసింది.