Begin typing your search above and press return to search.

ముంబయిలో రాకాసి గాలులు.. 100 అడుగుల హోర్డింగ్ కూలి 9 మంది బలి

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ ఏ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నా.. వెంటనే మన తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఆయా అంశాలకు భారీ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   14 May 2024 5:25 AM GMT
ముంబయిలో రాకాసి గాలులు.. 100 అడుగుల హోర్డింగ్ కూలి 9 మంది బలి
X

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో ఎక్కడ ఏ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నా.. వెంటనే మన తెలుగు రాష్ట్రాల్లోని మీడియా ఆయా అంశాలకు భారీ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంటుంది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మీడియా ఫోకస్ మొత్తం పోలింగ్.. దానికి అనుంబంధంగా చోటు చేసుకున్న పరిణామాల మీదనే ఉంది. దీంతో.. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటు చేసుకున్న ప్రక్రతి విపత్తు గురించి ఫోకస్ కాలేదు. సోమవారం ముంబయిలో చోటు చేసుకున్న భారీ గాలివాన దుమారాన్ని రేపింది. రాకాసి గాలులతో భారీగా ప్రాణ నష్టంతో పాటు.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఉదంతంలో పలువురు గాయపడ్డారు.

సోమవారం సాయంత్రం తేలికపాటి వర్షంతో మొదలై.. చూస్తుండగానే బలమైన ఈదురు గాలులు వీచాయి. కొన్నిచోట్ల రాకాసి గాలుల కారణంగా దట్టంగా దుమ్ము ఎగిసిపడింది. ఘాట్ కోపర్ లోని సమతానగర్ లో సాయంత్రం 4.30 గంటల వేళకు 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్ ఈదురుగాలుల తీవ్రతకు దాని పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్ పంప్ పై పడింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. 70 మంది గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద పలువురు చిక్కుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ హోర్డింగ్ కు ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెబుతున్నారు. ఇక.. వడాలాలోని బర్కత్ అలీ నాకా సమీపంలో నిర్మాణంలో ఉన్న మెటల్ పార్కింగ్ టవర్ కూలింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. ఎనిమిది వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా ముంబయి ఎయిర్ పోర్టులో దాదాపు 66 నిమిషాల పాటు విమాన రాకపోకల్ని నిలిపేశారు. ఈదురుగాలులు.. వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో స్తంభాలు కూలిపోవటంతో పాటు.. చెట్లు నేలకొరిగాయి. కొన్నిచోట్ల వైర్లు తెగిపడ్డాయి. పలు మార్గాల్లో మెట్రో సేవల్ని తాత్కాలికంగా నిలిపేశారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ లోనూ 2 గంటల పాటు లోకల్ ట్రైన్ సేవల్ని నిలిపేయటం గమనార్హం. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా ముంబయి మహానగరం రాకాసి గాలులతో ఉక్కిరిబిక్కిరి అయ్యిందని చెప్పాలి.