Begin typing your search above and press return to search.

విమాన టాయిలెట్‌ లో 100 నిమిషాలు.. ఏమి జరిగిందంటే...?

ఇలా విమానాల్లో జరుగుతున్న రకరకాలా విషయాలు ఇటీవల కాలంలో వైరల్ గా మారుతున్నాయి

By:  Tupaki Desk   |   17 Jan 2024 6:26 AM GMT
విమాన టాయిలెట్‌ లో 100 నిమిషాలు.. ఏమి జరిగిందంటే...?
X

గతకొంతకాలంగా విమానాలు, వాటిలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల చేష్టలు, అనుభవాలు మొదలైన విషయాలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా విమానంలోని సీట్లోనే మూత్ర విసర్జన చేసినవారు ఒకరైతే.. పక్కనున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించేవారు మరొకరు. ఇంకోపక్క తాగి అల్లరిచేసేవారు కొందరైతే... ఏకంగా పైలెట్ పైనే భౌతిక దాడిచేసిన వారు ఇంకొకరు!

ఇలా విమానాల్లో జరుగుతున్న రకరకాలా విషయాలు ఇటీవల కాలంలో వైరల్ గా మారుతున్నాయి. వీటికితోడు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలకు సంబంధించిన లూజ్ బోల్డ్ ల వ్యవహారం కూడా తీవ్రచర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా విమానంలోని టాయిలెట్ రూం లోకి వెళ్లిన ప్రయాణికుడు సుమారు 100 నిమిషాలపాటు లోపల చిక్కుకుపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

అవును... తాజాగా విమానంలోని ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. ఫ్లైట్‌ టేకాఫ్‌ కాగానే టాయిలెట్‌ రూంకు వెళ్లిన అతడు అందులోనే చిక్కుకుపోయాడు. ఈ ఘటన స్పైస్‌ జెట్‌ విమానంలో చోటు చేసుకొంది. దీంతో విమాన ప్రయాణానికి సంబంధించి మరోవార్త వైరల్ అవ్వడం మొదలైంది.

వివరాళ్లోకి వెళ్తే... ముంబయి నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎస్.జి.268 విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే ప్రయాణికుడు టాయిలెట్‌ రూంకు వెళ్లాడు. అనంతరం... డోర్‌ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయాడు. దీంతో భయాందోళనకు గురైన అతడు సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది తలుపు తెరిచేందుకు ఎంతగా యత్నించినా ఫలితం లేకపోయింది.

దీంతో సదరు ప్రయాణికుడు సుమారు 100 నిమిషాల పాటు ఆ టాయిలెట్‌ లోనే ఉండాల్సి వచ్చింది. ఫైనల్ గా విమానం బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన అనంతరం ఇంజినీర్లు వచ్చి తలుపు పగలగొట్టి ప్రయాణికుడిని కాపాడారు. అనంతరం అతడికి ప్రథమ చికిత్స అందించారు.