Begin typing your search above and press return to search.

బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఉలిక్కిపడ్డ మహారాష్ట్ర..

సరైన ఆహారం, మితాహారం తీసుకుంటే ఔషధంగా పని చేస్తుందని.. అదే అధికంగా, వింతైన ఆహారం తీసుకుంటే విషం అవుతుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు.

By:  Tupaki Political Desk   |   28 April 2026 10:08 AM IST
బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. ఉలిక్కిపడ్డ మహారాష్ట్ర..
X

సరైన ఆహారం, మితాహారం తీసుకుంటే ఔషధంగా పని చేస్తుందని.. అదే అధికంగా, వింతైన ఆహారం తీసుకుంటే విషం అవుతుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. మనం తీసుకునే ఆహారం కూడా మొత్తం కుటుంబాన్ని విషాధ వలయంలో నెడుతుందంటే నమ్ముతారా? అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. సంతోషకరమైన కుటుంబంలో ఒకేసారి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేవలం 12 గంటల వ్యవధిలో నిండు సంసారం కుప్ప కూలిపోవడం చూస్తుంటే 'ఫుడ్ పాయిజనింగ్' ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. ముంబయిలోని పైధోనీలో జరిగిన హృదయ విదారక ఘటన ఇప్పుడు భోజన ప్రియులను ఆందోళనలోకి నెట్టింది. శనివారం రాత్రి బంధువుల ఇంట్లో విందు ఆరగించి, ఇంట్లో పుచ్చకాయ తిన్న అబ్దుల్లా కుటుంబం.. అబ్దుల్లా డోకాడియా (40), అతని భార్య నస్రీన్ డోకాడియా (35), వారి ఇద్దరు కుమార్తెలు అయేషా (16) జైనాబ్ (13) ఆదివారం ఉదయానికల్లా ప్రాణాలు కోల్పోవడం మొత్తం నగరాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దంపతులు, వారి ఇద్దరు కుమార్తెలు (ఒకరు 13 ఏళ్ల బాలిక) సామూహికంగా మరణించడం వెనుక కేవలం ఆహార పదార్థాల కలయికే కారణమా లేక ఆ ఆహారంలో ఏదైనా విషపూరిత అంశాలు కలిశాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఏం జరిగి ఉండవచ్చు..?

సాధారణంగా బిర్యానీ, పుచ్చకాయ తిన్నంత మాత్రాన ప్రాణాలు పోవు. కానీ, ఇక్కడ కొన్ని అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. వేసవిలో బిర్యానీ వంటి మాంసాహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. అందులో వాడే మసాలాలు లేదంటే మాంసం గనుక కలుషితమైతే ప్రమాదకర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ప్రస్తుతం పుచ్చకాయలు త్వరగా పండటానికి, ఎర్రగా కనిపించడానికి కొన్ని రకాల రసాయనాలను వాడుతున్నారు. బిర్యానీ తిన్న తర్వాత శరీరంలో జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పుడు, ఇలాంటి రసాయనాలు కలిసిన పుచ్చకాయ తినడం వల్ల తీవ్రమైన రసాయన చర్య జరిగి ఉండవచ్చు అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయుర్వేదం, ఆధునిక పోషకాహార శాస్త్రం ప్రకారం.. భారీ భోజనం (బిర్యానీ వంటివి) తిన్న వెంటనే పండ్లు (ముఖ్యంగా నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ) తినడం వల్ల జీర్ణరసాలు పలచబడి, ఆహారం సరిగ్గా జీర్ణం కాక విషతుల్యంగా మారవచ్చని అంచనా వేస్తున్నారు.

ఫుడ్ పాయిజనింగ్..

అబ్దుల్లా కుటుంబ సభ్యులకు తెల్లవారుజామున 5 గంటలకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. 10 గంటల కల్లా వారు మరణించారంటే, ఆ విషం రక్తంలోకి ఎంత వేగంగా పాకిందో అర్థం చేసుకోవచ్చు. విపరీతమైన వాంతులు, విరేచనాల వల్ల శరీరంలోని నీరు, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోయి గుండెపోటు లేదంటే అవయవాలు విఫలమయ్యే (అవకాశం ఉంది. ఆహారంలో ఏదైనా శక్తివంతమైన బ్యాక్టీరియల్ టాక్సిన్ ఉంటే అది నరాల వ్యవస్థపై కూడా ప్రభావం చూపి ప్రాణాలను తీస్తుంది. అలా జరిగి ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి..

వేసవిలో మనం తినే ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఫంక్షన్లు లేదంటే రెస్టారెంట్లలో భోజనం చేసేటప్పుడు అది తాజాదేనా నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా నిల్వ ఉంచిన మాంసాహారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. మరీ ముఖ్యంగా వేసవిలో మాంసం తినాలంటే ఇంటి భోజనమే సేఫ్. వివాహాలు, వింధుల్లో కూడా చాలా వరకు మాంసం అవైట్ చేయడమే ఉత్తమమైన మార్గం. భోజనం చేసిన వెంటనే పండ్లు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అన్ని పండ్ల విషయంలో ఇది మంచిది కాకపోవచ్చు. భోజనానికి, పండ్లకు మధ్య కనీసం రెండు గంటల విరామం ఉండాలి. వాంతులు, విరేచనాలు మొదలైనప్పుడు ‘సాధారణ సమస్యే కదా’ అని ఇంట్లో ఉండకుండా, ఆసుపత్రికి వెళ్లాలి. ప్రాథమిక చికిత్స (ఓఆర్ఎస్ ) ప్రాణాలను కాపాడగలవు.

ముంబై పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపారు. నివేదిక వస్తేనే కారణం తెలుస్తుంది. కానీ, ఈ ఘటన ప్రతి ఒక్కరినీ భయపెడుతోంది. సరదాగా గడపాల్సిన విందు సమయం ఇలా విషాదంగా మారడం ఎవరికీ రాకూడని కష్టం. ఆహారం పట్ల మనం చూపే చిన్న ఉదాసీనత ప్రాణాంతకం కాగలదని ఈ ఘటన మనల్ని హెచ్చరిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం మరియు సరైన జీవనశైలి పాటించడమే ఇలాంటి విపత్తుల నుండి మనల్ని కాపాడుతుంది.