జీవితాన్నే కోల్పోయా.. 9 కోట్లు ఇప్పించండి.. ముంబై పేలుళ్ల నిర్దోషి
ముంబై లైఫ్ లైన్ అయిన లోకల్ ట్రైన్ వ్యవస్థ స్తంభించింది..! దేశమంతా ఉలిక్కిపడింది..! 1993 బాంబు పేలుళ్ల తర్వాత ముంబై మరోసారి భారీగా టార్గెట్ అయింది.
By: Tupaki Desk | 13 Sept 2025 12:12 PM ISTఅది 2006 జూలై 11... అంటే సరిగ్గా 19 ఏళ్ల కిందట... ముంబైలో అత్యంత రద్దీగా తిరుగుతున్నాయి లోకల్ ట్రైన్లు... వెస్ట్రన్ రైల్వే సబర్బన్ నెట్ వర్క్ లో ఒకదానివెంట ఒకటి వరుసగా ఏడు రైళ్లలో పేలుళ్లు జరిగాయి...! 180 మందిపైగా ప్రాణాలు కోల్పోయారు. ముంబై లైఫ్ లైన్ అయిన లోకల్ ట్రైన్ వ్యవస్థ స్తంభించింది..! దేశమంతా ఉలిక్కిపడింది..! 1993 బాంబు పేలుళ్ల తర్వాత ముంబై మరోసారి భారీగా టార్గెట్ అయింది. (2008 నవంబరు 26న మూడోసారి మరింత భయానక ఉగ్రదాడి జరిగింది).
ఐదుగురికి ఉరి.. ఏడుగురికి జీవిత ఖైదు.. అంతా నిర్దోషులే
2006 నాటి ముంబై రైలు పేలుళ్ల కేసులో అరెస్టయినవారిలో ఒకడు అబ్దుల్ వహీద్. మరో 12 మందిలో ఐదుగురికి ఉరిశిక్ష, ఏడుగురికి జీవితఖైదు పడింది. 2015లోనే అబ్దుల్ కు ట్రయల్ కోర్టులో ఊరట దక్కింది. ఉరి శిక్ష పడిన ఖైదీ ఒకరు నాలుగేళ్ల కిందట చనిపోయాడు. కాగా, సరైన ఆధారాలు లేనందున ఈ ఏడాది జూలైలో బాంబే హైకోర్టు 12 మందిని నిర్దోషులుగా ప్రకటించింది.
ట్రయల్ కోర్టు తీర్పుతో పదేళ్ల కిందటే నిర్దోషిగా విడుదలైనా.. తన జీవితమే తలకిందులైందని అబ్దుల్ వహీద్ వాపోతున్నాడు. తప్పుడు కేసు పెట్టినందుకు ఉపాధి కోల్పోయానని, చేయని నేరానికి కస్టడీలో చిత్రహింసలు అనుభవించానని తెలిపాడు. రూ.9 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు. జూలైలో మిగతా నిందితులు కూడా విడుదల కావడంతో ఇప్పుడు జాతీయ, మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించాడు. గతంలో తనలా అన్యాయంగా శిక్ష అనుభవించి పరిహారం పొందిన ఉదాహరణలను చూపుతూ పునరావాసం కల్పించాలని కోరాడు.
నేను టీచర్ ను.. ఉగ్ర ముద్ర వేశారు...
ఉపాధ్యాయుడిగా పనిచేసే తనను ఉగ్రవాదిగా భావించి అరెస్టు చేయడంతో ఉపాధి కోల్పోయినట్లు అబ్దుల్ తెలిపాడు. జైలు శిక్ష కారణంగా కెరీర్ నాశమైందన్నాడు. అత్యంత క్రూరమైన కస్టడీ జీవితంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని తెలిపాడు. జీవితం, చదువు, ఉద్యోగం అన్నీ కోల్పోయినట్లు వాపోయాడు. జైలుకెళ్లడంతో తనపై ఆధారపడిన కుటుంబం సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నాడు. రూ.30 లక్షల అప్పయిందని పేర్కొన్నాడు.
-వాస్తవానికి అబ్దుల్ విడుదలైనప్పటికి ఓ సహ నిందితుడు జైల్లో ఉన్నాడు. తన చర్యలతో అతడికి ఇబ్బంది రాకూడదని వేచి చూశానని అబ్దుల్ తెలిపాడు. అతడూ నిర్దోషిగా తేలాక హక్కుల సంఘాలను ఆశ్రయించాడు.
