12కోట్ల గంజాయితో పట్టుబడిన మోడల్.. కన్నడ నటి గోల్డ్ స్మగ్లింగ్ రేంజులో!
సాధారణంగా నగరాల్లోని హై-ప్రొఫైల్ రేవ్ పార్టీలు, పబ్బులు - సంపన్న వర్గాల యువతను టార్గెట్ చేసుకుని ఈ తరహా ప్రీమియం డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 1:33 AM ISTగత ఏడాది కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో హైడ్రామా అనంతరం నటి అరెస్ట్, జైలు, బెయిల్ కోసం ప్రయత్నాలు హాట్ టాపిక్ అయ్యాయి. విమానాశ్రయాల గుండా కస్టమ్స్ అధికారుల తణిఖీల మధ్య కూడా భయం అన్నదే లేకుండా, కోట్లాది రూపాయల బంగారం స్మగ్లింగ్ చేయడం గురించి తెలుసుకుని ప్రజలు ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు అలాంటి మరొక భిన్నమైన ఘటన షాకిచ్చింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా జరిగిన ఒక భారీ ఆపరేషన్‌లో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయు) అధికారులు అంతర్జాతీయ మత్తుపదార్థాల స్మగ్లింగ్ ముఠా కుట్రను భగ్నం చేశారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుండి వచ్చిన కేరళకు చెందిన మోడల్ హర్షా సన్నీ అనే యువతి లగేజీపై అధికారులకు అనుమానం రావడం ఒక పెద్ద క్రైమ్ గుట్టును రట్టు చేసింది. విమానాశ్రయంలోని కస్టమ్స్ జోన్ దాటుతున్న సమయంలో సదరు యువతి ప్రవర్తనలో తేడా గమనించిన సిబ్బంది తనను వెంటనే అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక సోదాల్లో ఎవరూ ఊహించని విధంగా భారీ ఎత్తున నిషేధిత డ్రగ్స్ వెలుగుచూడటం అక్కడి అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది.
ఆ యువతి ప్రయాణిస్తున్న సూట్‌కేసులను తెరిచి చూడగా.. లోపల అత్యంత ఆధునిక పద్ధతిలో ప్యాక్ చేసిన సంచులు కనిపించాయి. వాసన బయటకు రాకుండా.. స్కానింగ్ యంత్రాల కంటికి చిక్కకుండా ఉండేందుకు `వ్యాక్యూమ్ సీల్డ్ బస్తాలను` (గాలి చొరబడని విధంగా ఒత్తిడి చేసిన కవర్లు) ఉపయోగించి ఈ అక్రమ రవాణాకు తెరలేపారు. ఈ బ్యాగులను కట్ చేసి చూడగా అందులో విదేశాలలో అత్యంత ఖరీదైనదిగా భావించే `హైడ్రోపోనిక్ వీడ్` పట్టుబడింది. మట్టి లేకుండా కేవలం నీరు, పోషకాలతో ప్రత్యేక ల్యాబ్‌లలో పెంచే గంజాయి దొరికింది. కస్టమ్స్ వర్గాల అంచనా ప్రకారం... పట్టుబడిన ఈ రసాయన ముడిసరుకు అంతర్జాతీయ నల్లబజారులో దాదాపు 12 కోట్ల రూపాయల విలువ ఉంటుందని తేలింది.
గ్లామర్ ఫీల్డ్‌లో రాణిస్తూ... సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేరళ మోడల్ ఇలాంటి చట్టవ్యతిరేక పనుల వైపు ఆకర్షితురాలవ్వడం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేవలం విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి.... సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతోనే సదరు మోడల్ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాకు క్యారియర్‌గా (మందు చేరవేసే వ్యక్తిగా) మారి ఉండవచ్చని భావిస్తున్నారు. విదేశాల నుండి ఈ స్థాయి నాణ్యత కలిగిన గంజాయిని ముంబైకి తీసుకురావడానికి ఆమెకు సహకరించిన హ్యాండ్లర్స్ ఎవరు? దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎక్కడ ఉన్నారనే కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
సాధారణంగా నగరాల్లోని హై-ప్రొఫైల్ రేవ్ పార్టీలు, పబ్బులు - సంపన్న వర్గాల యువతను టార్గెట్ చేసుకుని ఈ తరహా ప్రీమియం డ్రగ్స్‌ను సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బ్యాంకాక్ నుండి ముంబైకి చేరిన ఈ 12 కోట్ల సరుకును ఇక్కడి స్థానిక ఏజెంట్లు ఎవరికి అప్పగించాల్సి ఉంది? దేశంలోని ఇతర మెట్రో నగరాలకు కూడా దీనిని రవాణా చేసే ప్లాన్ ఉందా? అనే లింకులను కనుగొనేందుకు అధికారులు నిందితురాలి కాల్ డేటాను, బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలను ఏమార్చడానికి స్మగ్లర్లు సరికొత్త రసాయన సాంకేతికతలను వాడుతుండటం రక్షణ విభాగాలకు పెద్ద సవాలుగా మారింది.
ఈ సంచలన అరెస్ట్ తర్వాత ఎయిర్‌పోర్టులలో హై-రిస్క్ దేశాల నుండి వచ్చే విమానాల ప్రయాణికులపై నిఘాను మరింత కఠినతరం చేశారు. పట్టుబడిన కేరళ మోడల్ హర్షా సన్నీపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్.డి.పి.ఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైలులో విచారణను ఎదుర్కొంటోంది. సరిహద్దులు దాటి వస్తున్న ఈ మత్తు భూతాన్ని అరికట్టేందుకు కస్టమ్స్, ఎన్‌సీబీ విభాగాలు మరింత సమన్వయంతో ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహించాలని నిర్ణయించాయి.
