షాకింగ్... ముంబై విమానం ల్యాండింగ్ సమయంలో 3 టైర్లు పగిలిపోయాయి!
ఈ సమయంలో తాజాగా ముంబైలో ఓ ఎయిరిండియా విమానం టెన్షన్ పెట్టింది. ఆ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఏఐ) ప్రతినిధి వెల్లడించారు.
By: Tupaki Desk | 21 July 2025 3:59 PM ISTఅహ్మదాబాద్ ఘటన అనంతరం పలు విమానయాన సంస్థలకు చెందిన విమానాలు సాంకేతిక సమస్యలతో టెన్షన్ పెడుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ముంబైలో ఓ ఎయిరిండియా విమానం టెన్షన్ పెట్టింది. ఆ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వివరాలను ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్ఎంఏఐ) ప్రతినిధి వెల్లడించారు.
అవును... తాజాగా ముంబైలో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబై వెళ్లిన ఎయిరిండియా విమానం.. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై అదుపు తప్పింది. ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విమానం అదుపుతప్పి పక్కకు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
దీంతో... వెంటనే స్పందించిన అధికారులు అత్యవసర ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దింపారు. వారు.. ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా దింపినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో విమాన ఇంజిన్, మూడు టైర్లు దెబ్బతిన్నాయని వెల్లడించారు. అయితే ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ సందర్భంగా స్పందించిన విమానాశ్రయ ప్రతినిధి... ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో విమానాశ్రయ ప్రాథమిక రన్ వే (09/27) కు స్వల్ప నష్టం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో.. దీంతో ఇతర విమానాల ల్యాండింగ్ కోసం సెకండరీ రన్ వే (14/32) ను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
టచ్ డౌన్ జోన్ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత విమానం రన్ వే నుండి 16 నుండి 17 మీటర్ల దూరం పక్కకు జరిగింది కానీ.. సురక్షితంగా పార్కింగ్ స్టాండ్ కు చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఉదయం 9:27 గంటలకు కొచ్చి నుండి వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ-2744 ల్యాండ్ అయినప్పుడు జరిగింది.
ఈ విషయాన్ని దర్యాప్తు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బృందం విమానాశ్రయంలో ఉందని వర్గాలు తెలిపాయి. మరోవైపు దెబ్బతిన్న రన్ వే పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
